కొవిడ్ టీకా పంపిణీకి సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన డ్రైరన్ విజయవంతంగా ముగిసింది. జిల్లా జనరల్ ఆసుపత్రి, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉదయం 10 గంటల నుంచి డ్రైరన్ ప్రారంభమైంది. ఒక్కో కేంద్రానికి 25 మంది చొప్పున టీకా వేయడం మినహా నాలుగు దశల ప్రక్రియలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
ఆరోగ్యం బావుంటేనే టీకా...
వెయింటింగ్, రిజిస్ట్రేషన్, వాక్సినేషన్, అబ్జర్వేషన్ కోసం నాలుగు గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వాక్సిన్ కోసం నమోదు చేసుకున్న వ్యక్తి తొలుత వెయిటింగ్ రూమ్‌కి చేరుకుంటారు. అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ విభాగానికి వెళ్తారు. టీకా కోసం నమోదు చేసుకున్న వ్యక్తేనా కాదా? అతని గుర్తింపు కార్డు, మొబైల్ నెంబర్, చిరునామా ఆధారంగా కో-విన్ డాటాతో సరిచూసుకుంటారు. అంతా సవ్యంగా ఉంటేనే టీకా వేసే గదికి పంపిస్తారు. టీకా తీసుకునే వ్యక్తి ఆరోగ్యం బాగానే ఉందా? పరిశీలించిన తర్వాత ఆరోగ్యం బాగుంటేనే టీకా వేస్తారు.
పర్యవేక్షణ అనంతరం...
అనంతరం మరోగదిలో అరగంట పాటు పర్యవేక్షణలో ఉంచుతారు. ఆరోగ్య పరంగా దుష్పరిణామాలు ఎదురైతే వాటిని అధిగమించేందుకు అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ కిట్‌ను అందుబాటులో ఉంచారు. అత్యవసరమైతే ఆక్సిజన్ సైతం అక్కడ అందుబాటులో ఉంటుంది. అరగంట తర్వాత టీకా తీసుకున్న వ్యక్తిని బయటకు పంపిస్తారు.
పరిశీలించిన కలెక్టర్, జేసీ...
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రిలో డ్రైరన్ తీరును పరిశీలించగా... జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్రైరన్‌ను అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పరిశీలించారు. ఈ డ్రైరన్‌లో టీకా తీసుకునే వ్యక్తి ప్రవేశించే ద్వారం, బయటకు వెళ్లే ద్వారా వేర్వేరుగా ఉంటే మేలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
టీకా వేసిన అనంతరం వైద్యుల పర్యవేక్షణ గది సైతం పెద్దదిగా ఉండాలని.. ఒకే ఇంటిపేరు, వ్యక్తి పేరున్నవాళ్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఆధార పత్రాలు పరిశీలించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించారు. డ్రైరన్ లో గమనించిన అంశాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు.
కో- విన్యాప్లో నిక్షిప్తం...
వాక్సినేషన్లో జరిగే నాలుగు దశల ప్రక్రియల్ని కో-విన్యాప్లో నిక్షిప్తం చేశారు. వెరిఫికేషన్, అథెంటికేషన్, వాక్సినేషన్ మూడింటిని పూర్తి చేస్తే ఆ వ్యక్తికి టీకా పంపిణీ ముగిసినట్లు లెక్క. టీకాను రెండు డోసులు తీసుకోవాల్సి ఉన్నందున మొదటిసారి ఏ టీకా వేశారో... అదే టీకా రెండోసారి వేసేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. భవిష్యత్తులో టీకా కోసం ఎవరైనా ఎక్కడి నుంచైనా నమోదు చేసుకునేలా కో-విన్యాప్ని రూపొందించారు. ఇవాళ జరిగిన డ్రైరన్‌లో కో-విన్ వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో 7 కేంద్రాల్లో డ్రైరన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం