దేశంలో కొన్నిరోజుల్లో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభంకానుండగా కేంద్రం మార్గదర్శకాల మేరకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు చేపట్టిన డ్రైరన్... మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తైంది. ప్రతి రాష్ట్రంలో కనీసం మూడు చోట్ల డ్రైరన్ చేపట్టాలన్న కేంద్రం సూచన మేరకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపీఎచ్సీ, గాంధీ ఆస్పత్రి సహా ప్రైవేటు ఆస్పత్రుల విభాగంలో సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో డ్రైరన్ చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాల్లోని జీజీహెచ్, జానంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నేహా షైన్ ఆస్పత్రుల్లో ప్రక్రియను నిర్వహించారు.
నాలుగు దశలు...
టీకావేయడం మినహా నాలుగుదశల్లో జరిగే ప్రక్రియను ఇందులో పరిశీలించారు. తొలుత వెయిటింగ్,. రెండోదశలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ, మూడోదశలో వ్యాక్సినేషన్, నాలుగోదశలో పర్యవేక్షణను పరిశీలించారు. ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చినవారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాతీసిన అధికారులు... దీర్ఘకాలిక వ్యాధులు సహా ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయా అనే వివరాలు సేకరించారు. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో టీకా ఇచ్చిన తర్వాత... తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్షుణ్ణంగా పరిశీలించారు.
గవర్నర్ పరిశీలన...
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డ్రైరన్ ప్రక్రియను గవర్నర్ తమిళిసైసౌందర రాజన్ పరిశీలించారు. తిలక్ నగర్ యూపీహెచ్సీకి వెళ్లిన గవర్నర్... అక్కడి ఏర్పాట్లు, డ్రైరన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్, ఇమ్యునైజేషన్ జేడీ సుధీర, హైదరాబాద్ డీఎంహెచ్ఓ... తిలక్‌నగర్ యూపీహెచ్‌సీలో ప్రక్రియను పరిశీలించారు.