Rajiv Swagruha: రాజీవ్ స్వగృహ కోసం సేకరించి, లబ్ధిదారులకు కేటాయించకుండా మిగిలిపోయిన ఇండ్లస్థలాలను, వేలం ద్వారా విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయకుండా వేలం ఎలా నిర్వహిస్తారంటూ గతంలో వాటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు, నెలవారీ కిస్తీలు చెల్లించిన వాళ్లు, ప్రస్తుతం స్వగృహలో ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్నవాళ్లూ అధికారులను నిలదీస్తున్నారు. మహబూబ్నగర్ పట్టణంలో రాజీవ్ స్వగృహ కోసం 84ఎకరాల స్థలాన్ని సేకరించి 959 ప్లాట్లతో లేఅవుట్ చేశారు. 3,840మంది వాటిలో ఇళ్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 452 ఇండ్ల స్థలాలను లబ్ధిదారులకు కేటాయించారు. వీటిలో 124మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. 304మంది లబ్ధిదారుల ఇళ్లు పెండింగ్లోనే ఉన్నాయి. కొన్నాళ్లకు మరో 28 ఖాళీప్లాట్లను బహిరంగ వేలంతో విక్రయించారు. మిగతా ప్లాట్లు ఖాళీగానే ఉన్నాయి. వీటిని ప్రస్తుతం ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
వేలంపాట నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు
ఇండ్ల స్థలాల కోసం గతంలో 3వేలు చెల్లించి పేర్లు నమోదు చేసుకున్నారు. వారికి ఇంటి స్థలం కేటాయించలేదు. అలాంటి వారికి ముందుగా కొనుగోలు చేసే అవకాశం ఇవ్వకుండా నేరుగా వేలం వేయడం ఏమిటని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది వాయిదాల రూపంలో కొంతడబ్బును స్వగృహకోసం చెల్లించారు. వారికి ఇండ్ల స్థలం దక్కలేదు. అప్పట్లో చెల్లించిన సొమ్మును తిరిగి తీసుకునే అవకాశాన్ని ప్రస్తుతం ప్రభుత్వం కల్పించింది. ఎన్నేళ్లు దరఖాస్తు చేసుకుని ఎదురుచూసిన వారికి అవకాశం లేకుండా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే డబ్బులు తిరిగి ఇస్తోందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.ఈ విషయంలో తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని, అవసరమైతే కోర్టును సైతం ఆశ్రయిస్తామని గతంలో డబ్బులు చెల్లించిన లబ్ధిదారులు హెచ్చరిస్తున్నారు.
వేలాన్ని అడ్డుకుంటామంటున్న కాలనీవాసులు