ఎడతెరపిలేని వర్షాలు..నిలిచిన రాకపోకలు, కూలిన ఇళ్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుసున్న వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరిన సరళాసాగర్ జలాశయం గేట్లు తెరచుకున్నాయి.
2019 డిసెంబర్ నెలలో సరళాసాగర్ ఆనకట్ట తెగిపోయింది. పునరుద్ధరించిన తెలంగాణ సర్కారు.. ఆగస్టులో మళ్లీ కల్వకుర్తి ఎత్తిపోతల జలాలతో నింపింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఇవాళ పూర్తిగా నిండటంతో సైఫల్, ఉడ్గేట్లు తెరచుకున్నాయి.
2009 వరదల తర్వాత మళ్లీ ఇప్పడు గేట్లు తెరచుకోవడం వల్ల సరళాసాగర్‌ను చూసేందుకు జనం వచ్చి వెళ్తున్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సైతం సరళాసాగర్ వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆసియాలోనే మొదటిది, ప్రపంచంలోనే రెండోదైన సరళాసాగర్‌ను పర్యాటక కేంద్రంగా మర్చాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
ఉద్ధృతంగా సరళాసాగర్
సరళాసాగర్ నుంచి దిగువకు నీరు విడదల కావడం వల్ల ఊకచెట్టు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఊకచెట్టు వాగు ప్రవాహం కారణంగా కొత్తకోట-ఆత్మకూర్, అప్పరాల-తిప్పడంపల్లి, రేచింతల-శాఖపూర్, చిన్నచింతకుంట-అమ్మాపూర్ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. సరళాసాగర్ జలాశయం నుంచి వరద నీరు రామన్‌పాడు జలాశయంలోకి చేరుతుంది.
రామన్ పాడు నుంచి ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ రిజర్వాయర్ నుంచి సైతం రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడదల చేస్తున్నారు. రంగ సముద్రం జలశాయం నిడటం వల్ల ముంపు గ్రామమైన నాగరాల ఇళ్లలోకి నీరు చేరింది.
పంట పొలాలు మునిగిపోయాయి. శంకర సముద్రం జలాశయం నిండటం వల్ల మూడు గేట్లను అడున్నర పైకెత్తి 1,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కోయిల్‌సాగర్ పూర్తి స్థాయినీటి మట్టం 32.9 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 32.6 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో రెండు వేల క్యూస్కెక్కులు ఉండటం వల్ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
రాకపోకలకు అంతరాయం
వనపర్తి నల్లచెరువు అలుగు పారడం వల్ల ఖిల్లాగణపురం ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పానగల్లో కోతకు గురైన కాల్వలు, రహదారులు, చెరువులను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరిశీలించారు. కోడేరు మండలం బావాయిపల్లి సమీపంలోని వాగు పొంగి కారు కొట్టుకుపోయింది.
చిన్న చింతకుంట మండలం నెల్లికొండి సీతారాం పేట మధ్య మన్నేవాగు ఉద్ధృతంగా పారడంతో రాకపొకలు నిలిపేశారు. దుంధుభీ వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల రఘుపతి పేట వద్ద రాకపోకల్ని నిలిపేశారు. అక్కడి వాగులో బస్సు చిక్కుకుంది. కొల్లాపూర్ మండలంలో ముక్కిడిగుండం వాగు వల్ల నార్లాపూర్- ముక్కిడిగుండం మధ్య రాకపోకలు నిలిచి పోయాయి.
తల్లీ, కూతురు మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం రాకొండలో ఇల్లు కూలి తల్లీ, కూతురు మృతి చెందారు. ఎడ తెరపిలేని వర్షాలతో మట్టిగోడలతో నిర్మించిన ఇల్లు కూలి ఇద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలు పురపాలికల్లో పాత ఇళ్లు, శిథిలావస్థకు చేరిన ఇళ్లు పాక్షకంగా, పూర్తిగా కూలిపోయాయి.
ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమతమైంది. లోతట్టు ప్రాంతాలు, శిథిలావస్థకు చేరిన ఇళ్ల నుంచి ప్రజల్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో అధికారులు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. తక్షణ సాయం కోసం జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూం నెంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
- మహబూబ్‌నగర్ కంట్రోల్ రూం నెంబర్- 08542-241165
- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ - 08546-274007
- నారాయణపేట జిల్లా కంట్రోల్ రూం నెంబర్లు- 08506- 281367, 08506-281368, 08506 281369
- వనపర్తి జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్లు - 08545-233525, 7288064701
- నాగర్ కర్నూల్ జిల్లా కంట్రోల్ రూం నెంబర్- 08540-230201
- గద్వాల పురపాలక హెల్ప్ లైన్ నంబర్లు- 9966051523, 9963065135, 964284323, 9100908832
- కల్వకుర్తి పురపాలక సంఘం హెల్ప్ లైన్ నెంబర్లు- 9441162460, 9160333299
ఇదీ చూడండి :ఉగ్ర గోదావరి : మూడో ప్రమాద హెచ్చరిక జారీ