పురపాలిక ఎన్నికలు జరిగిన 3 మున్సిపాలిటీల్లో తెరాస విజయకేతనం ఎగురవేసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 27 వార్డులు ఉండగా... 23 స్థానాలు గెలుచుకుని ఛైర్మన్ పదవిని దక్కించుకుంది. కాంగ్రెస్-2 భాజపా-2 వార్డులతో సరిపెట్టుకున్నాయి. గెలిచిన అన్నివార్డుల్లోనూ తెరాస స్పష్టమైన అధిక్యాన్ని కనబరిచింది. తొలి రౌండ్లోనే 19 వార్డులకు సంబంధించిన ఫలితాలు ఒకేసారి వెలువడ్డాయి. అందులో అత్యధికం తెరాస గెలుచుకోవడం వల్ల ఛైర్మన్ పదవి గులాబీ పార్టీదేనని తేలిపోయింది. ఆ తర్వాత వెలువడిన ఫలితాల్లోనూ అధికంగా తెరాస గెలుచుకుంది. జడ్చర్ల మున్సిపాలిటీగా ఏర్పడిన పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికలు కావడం వల్ల అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నాయి. ఏడేళ్లలో తెరాస చేసిన అభివృద్ధిని వివరిస్తూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రజల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ మల్లురవి, భాజపా తరఫున మాజీ మంత్రి డీకే అరుణ బాధ్యతలు తీసుకుని ప్రచారం నిర్వహించినా... ఫలితం లేకపోయింది. ప్రజలు తెరాస వైపే మొగ్గు చూపారు. జడ్చర్ల ఛైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వు కాగా... గెలిచిన అభ్యర్థుల్లో 8వ వార్డు తెరాస అభ్యర్థి లక్ష్మి పేరు పరిశీలనలో ఉంది.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో సైతం కారు జోరు కొనసాగింది. మొత్తం 20 వార్డుల్లో తెరాస 13 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్-6 వార్డులు గెలుచుకోగా... భాజపా ఒక్క స్థానానికే పరిమితమైంది. తొలి రెండు రౌండ్లలో తెరాస- కాంగ్రెస్‌లు సమాన స్థానాలు పొందగా... ఫలితాలు ఉత్కంఠ రేపాయి. ఆ తర్వాతి 2 రౌండ్లలో అధిక స్థానాలు తెరాస గెలుచుకోగా ఉత్కంఠకు తెరపడింది. 2016లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో తెరాస- మహకూటమి పోటీ పడగా.. 20 వార్డులకు 20 వార్డులు తెరాసనే గెలుచుకుంది. ఆ రికార్డును తిరగ రాయాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. విస్తృత ప్రచారం నిర్వహించారు. కానీ... 13 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్, భాజపా సైతం ఈ ఎన్నికల్ని సవాలుగా స్వీకరించాయి. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ... కాంగ్రెస్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. భాజపా సైతం అన్నివార్డుల్లో అభ్యర్ధుల్ని పోటీకి నిలిపింది. విజయం మాత్రం తెరాసనే వరించింది. అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ జరనల్‌కు కేటాయించగా... ఛైర్మన్ అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు జరుగుతోంది. 16వ వార్డు నుంచి గెలిచిన నర్సింహ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రజాతీర్పును గౌరవిస్తామని... అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని గువ్వల బాలరాజు తెలిపారు.