Koil Sagar irrigation project: మహబూబ్‌నగర్ జిల్లాలో ఏకైక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కోయల్ సాగర్. 1945-48 మధ్య కాలంలో అప్పటి నిజాం ప్రభుత్వం రూ.80 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించింది. 12 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో రెండు కొండల మధ్య పెద్దవాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. గేట్లు ఎత్తినప్పుడు దిగువకు విడుదలయ్యే నీటి ప్రవాహంతో కోయల్ సాగర్‌కు పర్యాటక శోభ సంతరించుకుంటుంది. గేట్లు ఎత్తకపోయినా ప్రాజెక్టు అందాల్ని వీక్షించేందుకు సెలవు దినాల్లో, పండుగ రోజుల్లో సందర్శకులు పోటెత్తుతూనే ఉంటారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సహా హైదరాబాద్, రాయచూర్ వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం వచ్చి కోయల్ సాగర్ ప్రకృతి అందాలు ఆస్వాదించి వెళ్తుంటారు.
మూత్రశాలలు లేక మహిళలు అవస్థలు: కోయల్ సాగన్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నది ఎన్నో ఏళ్ల డిమాండ్. హామీలు, ప్రతిపాదనలు తప్ప పర్యాటక అభివృద్ధికి అడుగులు ముందుకు పడటం లేదు. ఇటీవలే రాష్ట్ర పర్యాటక శాఖ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడ బోటింగ్‌ను ప్రారంభించింది. కానీ మౌలిక వసతుల కల్పనను మాత్రం విస్మరించింది. సాగర్ అందాలను వీక్షించేందుకు వచ్చిన సందర్శకులకు సేద తీరేందుకు నీడ ఉండదు. తాగేందుకు మంచి నీళ్లు దొరకవు. తిందామంటే తిండి కూడా కష్టమే. ప్రత్యేక గదులు, మూత్రశాలలు లేకపోవడంతో నానా అవస్థలు పడాల్సిందే. అందుకే ఇక్కడికి వచ్చే వారు కనీస సదుపాయలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు.