దాతల సాయంతో.. వలంటీర్లను నియమించి పాఠశాలలో విద్యాబుద్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా.. ఉపాధ్యాయ ఖాళీలే ప్రధాన సమస్యగా మారాయి. అన్ని సబ్జెక్టులు బోధించడానికి సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి నారాయణపేట జిల్లాలో విద్యార్ధుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. పలు పాఠశాలల్లో సొంత డబ్బులతో విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు బోధన సక్రమంగా అందేలా చూస్తున్నారు.
నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. విద్యార్ధుల సంఖ్య 240కి పైగా ఉండగా.. అందుకు తగిన ఉపాధ్యాయులు లేరు. ఈ సమస్యను తల్లిదండ్రుల దృష్టికి ఉపాధ్యాయులు తీసుకెళ్లారు. తల్లిదండ్రులు తమ ఒక్కరోజు కూలీ రూ.500 విరాళంగా ఇవ్వాలని కోరగా, వారు స్పందించి సాయం అందించారు.
ఆ డబ్బుతో ముగ్గురు విద్యా వాలంటీర్లను నియమించుకుని బోధన సక్రమంగా సాగేలా చూస్తున్నారు. ధన్వాడ ఉన్నత పాఠశాలలోనూ అదే పరిస్థితి. 900 మందికి పైగా విద్యార్ధులున్న పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు గురువులు లేరు. తల్లిదండ్రులు సాయం చేసిన డబ్బుతో.. నలుగురు విద్యా వాలంటీర్లను నియమించి విద్యాబోధన చేస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు.
230 మంది విద్యార్ధులున్న ఉట్కూరు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు, ఉర్దూ మాధ్యమాలున్నాయి. తెలుగు మాధ్యమంలో మూడు సబ్జెక్టులకు టీచర్లు లేరు. లయన్స్ క్లబ్ సాయంతో తెలుగు బోధన కోసం వాలంటీర్‌ను నియమించుకున్నారు. ఇక బషీరుద్దిన్ బాబూఖాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉర్దూ బోధించేందుకు మరో వాలంటీర్‌ను నియమించుకున్నారు. కానీ జీవశాస్త్రం బోధించేందుకు ఇప్పటికీ ఆ పాఠశాలలో ఉపాధ్యాయలు లేరు. తెలుగు మీడియంలో చెప్పే ఆంగ్ల ఉపాధ్యాయులే.. ఉర్దూ మీడియం పిల్లలకు ఆంగ్లం బోధిస్తున్నారు.
బిజ్వార్ పాఠశాలలోనూ 10 మంది ఉపాధ్యాయులకు ఆరుగురే పని చేస్తుండగా.. విద్యాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి తెలుగు బోధన కోసం వాలంటీర్‌ను నియమించారు. పిల్లలకు నాణ్యమైన బోధన అందాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులు అడిగిన వెంటనే సాయం అందించామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విద్యావంతులైన యువతీ యువకులు రూ. 2,500 నుంచి రూ.5 వేల వరకు నామమాత్రపు గౌరవ వేతనంతో పని చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దామరగిద్ద మండలం మొగలిమడక, మాగనూరు మండలం వడ్వాట్ పాఠశాలలు.. ఇలా నారాయణపేట జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను స్వచ్ఛందగా నియమించుకుని బోధనలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ చదవండి: