పాలమూరు జిల్లా స్వయం సహాయక సంఘం మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను, అమ్మకాలను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్టాళ్లను, ఉత్పత్తులను పరిశీలించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సంఘాలకు వడ్డీ లేని రుణాలిచ్చామని మంత్రి గుర్తు చేశారు. మహిళా సంఘాలు నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నా.. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక లాభపడట్లేదని మంత్రి అన్నారు. సరైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
1000 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ !
త్వరలోనే మహబూబ్‌నగర్‌లోని వెయ్యి ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళా సంఘాలు మంచి ఉత్పత్తులను తయారు చేయాలని, వాటిని ఫుడ్ పార్కులో మార్కెటింగ్ చేసేందుకు అవసరమైన స్థలం కేటాయిస్తామని పేర్కొన్నారు. ఆర్గానిక్ ఫుడ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు 'మహా' పేరును నామకరణం చేసి లోగోను ఆవిష్కరించారు.