మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్వహించిన జన అదాలత్లో మొదటి రోజు మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులంబ గద్వాల జిల్లాలకు సంబంధించి ఆరు కేసులను విచారించారు. కమిషన్ చొరవతో నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి జ్యోతిశ్వరి భూమికి సంబంధించిన కేసును పరిష్కరించారు. ఒక కేసుకు సంబంధించి సమగ్ర విచారణ నిర్వహించి 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.
మరో కేసులో అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఎస్సీ, ఎస్టీ చట్టాలను ఉల్లంఘించి ఇబ్బందులకు గురి చేసినట్లయితే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేయాలని, కమిషన్ ద్వారా ఆయా కేసుల విషయమై నోటీసులు జారీ చేసినప్పుడు వాటికి తక్షణమే స్పందించి నివేదికలు సమర్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు.