తెలంగాణ

telangana

By

Published : Dec 8, 2022, 2:59 PM IST

ETV Bharat / state

సన్నరకం ధాన్యం.. రైతులకు కలిసొచ్చిన కాలం

Fine Grain more sold in mahabubnagar district: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ వానాకాలం సన్నరకం ధాన్యం పండించిన రైతుకు కాలం కలిసొచ్చింది. కనీస మద్దతు ధరకు మించి గరిష్ఠంగా 2 వేల400 వరకు చెల్లించి ప్రైవేటు వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు చూడని రైతులు... మార్కెట్లలోనే ధాన్యం విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులు, పాలమూరులో ధాన్యం నాణ్యత, విదేశీ ఎగుమతులకు డిమాండ్ పెరగడం వంటి కారణాలతో సన్నరకం పండించిన రైతులకు కలిసొచ్చింది.

Fine Grain
Fine Grain

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సన్నరకం ధాన్యం.. రైతులకు కలిసొచ్చిన కాలం

Fine Grain more sold in mahabubnagar district: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పండించిన సన్నరకం ధాన్యం... ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కంటే ప్రైవేటులోనే ఎక్కువగా అమ్ముడు పోతోంది. వ్యాపారులు సన్నరకం ధాన్యాన్ని పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. మేలు రకానికి ప్రభుత్వ మద్దతు ధర 2060 రూపాయలుంటే... బహిరంగ మార్కెట్లో ధాన్యం ధర క్వింటాకు 2300 నుంచి 2600 వరకు పలుకుతోంది. మహబూబ్‌నగర్‌ మార్కెట్‌లో గరిష్ఠ ధర ఈనెల 7న 2400 రూపాయలు పలికింది.

నవంబర్ మొదటివారంలో మద్దతు ధరే పలికిన సన్నరకం ధాన్యం.. డిసెంబర్ నాటికి క్రమంగా పెరుగుతూ వస్తోంది. తేమశాతం, నాణ్యత బాగున్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర మాత్రమే చెల్లిస్తున్నారు. పైగా డబ్బుల చెల్లింపులో ఆలస్యమవుతోంది. దీంతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకునేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈసారి సన్నరకం ధాన్యం నాణ్యత బాగుంది.

రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడి, నాణ్యత తగ్గింది. ఈ పరిస్థితుల్లో జిల్లాకు చెందిన మిల్లర్లతోపాటు, ఇతర ప్రాంతాల వ్యాపారులు బాదేపల్లి, మహబూబ్‌నగర్‌, దేవరకద్ర మార్కెట్లలో ఎక్కువగా పంట కొనుగోలు చేస్తున్నారు. బాదేపల్లి మార్కెట్‌కు నిజామాబాద్‌తో పాటు ఇతర జిల్లాల వ్యాపారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రెండు వారాలుగా ధాన్యం విక్రయాలు ఊపందుకున్నాయి. ధాన్యం తేమశాతం కొంత ఎక్కువగా ఉన్నా పారా బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు ఎగుమతుల కోసం ఎక్కువ ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరో 100 రూపాయలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

'మేము పోయినసారి పొందిన దానికంటే ఈసారి అధికంగా సన్నరకం ధాన్యం దిగుబడిపై లాభాన్ని పొందుతున్నాం. పోయినసారి మేలురకానికి రూ.2060 ఉంటే ఈసారి రూ.2300 పైగానే ధర పలుకుతుంది. అలాగే ప్రైవేటు వారికి అమ్ముకుంటే వెంటనే డబ్బులు చెల్లిస్తున్నారు. దొడ్డు రకం బియ్యం రూ.1900 నుంచి రూ.2040 పైగా ఇస్తుంటే.. సన్న వడ్లకు ప్రభుత్వ ధర కంటే అధికంగా వస్తుంది. సన్నరకం ధాన్యానికి బాగా గిరాకీ ఉంది. అదే ప్రభుత్వ మార్కెట్​కి అమ్మితే డబ్బులు రావడానికి నెలకు పైగానే పడుతుంది. ప్రైవేట్​కి అమ్ముకుంటే వెంటనే డబ్బులు ఇస్తున్నారు.'-రైతులు

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కేవలం దొడ్డురకం ధాన్యం వెళ్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం రెండున్నర లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. ఇప్పటివరకు లక్ష మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. నారాయణపేట జిల్లాలో 3లక్షల మెట్రిక్ టన్నులకు కేవలం 50 వేల మెట్రిక్‌ టన్నులు కొన్నారు. వనపర్తి జిల్లాలో 4లక్షల 30వేల మెట్రిక్ టన్నులకు లక్షా 25వేలు, జోగులాంబ గద్వాల జిల్లాలో రెండున్నర లక్షల మెట్రిక్ టన్నులకు కేవలం 4 వేల 500 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పటివరకు కొనుగోలు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details