తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి పాలమూరులో పత్తి రైతుల పడిగాపులు

పండించిన పంటను అమ్ముకోవడానికి పత్తి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల బారులు తీరుతూనే ఉన్నాయి. ప్రతి కేంద్రానికి వంద నుంచి 200 వరకూ పత్తి వాహనాలు వస్తుండగా... 30 నుంచి 70 వాహనాల వరకూ మాత్రమే అధికారులు కొనుగోలు చేస్తున్నారు. రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

cotton
పాలమూరులో పత్తి రైతుల పడిగాపులు

By

Published : Dec 11, 2019, 7:29 AM IST

పాలమూరులో పత్తి రైతుల పడిగాపులు

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని ఐదు జిల్లాలు కలిపి మొత్తం 11 పత్తి కొనుగోలు కేంద్రాలను సీసీఐ ఏర్పాటు చేసింది. అధిక వర్షాల కారణంగా దిగుబడి తగ్గినా.. నవంబర్, డిసెంబర్ మాసాల్లో పత్తి రాక తీవ్రమైంది. నవంబర్ మొదటి వారం నుంచి దశల వారీగా కొనుగోలు కేంద్రాలను సీసీఐ ప్రారంభించింది. ఒక్కో కేంద్రానికి రోజూ నూరు నుంచి 150 వరకూ వాహనాలు వస్తున్నాయి.

జిన్నింగ్ మిల్లుల్లో...

జిన్నింగ్ మిల్లుల సామర్థ్యాన్ని బట్టి రోజూ 30 నుంచి 60వాహనాల వరకే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన పత్తి సైతం జిన్నింగ్ మిల్లుల్లో పేరుకుపోతోంది. ఆ పత్తిని తరలిస్తే తప్ప తిరిగి కొనుగోలు చేయలేని పరిస్థితి. ఇందువల్ల ఒకటి రెండు రోజులు కొనుగోళ్లు నిలిపివేస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకొచ్చిన రైతు... నాలుగైదు రోజులు అక్కడే పడిగాపులు పడాల్సి వస్తోంది. నిత్యం తిండి ఇతర ఖర్చులు, వాహనాల కిరాయి తడిసి మోపడవుతోంది. \

పద్ధతి పాటించడం లేదు...

వరస క్రమంగా పంపే విషయంలోనూ ఓ పద్ధతిని పాటించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు పత్తిని కొనుగోలు చేసే చోట కొంతమందిని ముందే పంపించి వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పేరుకు నంబర్లు వేసి వరుస క్రమమని చెప్పినా.... పైరవీ చేసిన రైతులను మాత్రం ముందుగానే అనుమతిస్తున్నారని అంటున్నారు. అలా కాకుండా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలను పెంచి.. అదనపు కేంద్రాలను ఏర్పాటు చేస్తే అమ్మకాలు త్వరగా జరుగుతాయని డిమాండ్ చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా...

నాగర్​కర్నూల్, నారాయణపేట, మహబూబ్​నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని అన్ని కొనగోలు కేంద్రాల్లో దాదాపు రైతుల పడిగాపులు ఇలాగే ఉన్నాయి. అదే అదనుగా భావిస్తున్న ప్రైవేటు దళారులు.... తేమశాతంతో సంబంధం లేకుండా తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కకుండా పోతోంది.

ఇవీ చూడండి: 'కాళేశ్వ‌రం ప్రాజెక్టు.. తెలంగాణకు ఓ మ‌కుటాయ‌మానం'

ABOUT THE AUTHOR

...view details