మంత్రులకు నిరసన సెగ... సమ్మేళనంలో సర్పంచ్ల పంచాయితీ! సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలో జరిగిన పంచాయతీరాజ్ సమ్మేళాలకు ఆయన హాజరయ్యారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఛలో పాలమూరుకు సర్పంచ్ సంక్షేమ సంఘం పిలుపునివ్వడంతో జిల్లాకు చెందిన సర్పంచ్‌లు అంబేడ్కర్ కూడలికి చేరుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు.
నేలపై కూర్చొని నిరసన
అక్కడి నుంచి వైట్‌హౌస్‌లో జరుగుతున్న పంచాయతీ రాజ్ సమ్మేళనం వద్దకు చేరుకున్నారు. తమ డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే సమావేశానికి హాజరవుతామని బయట నిలబడి నినాదాలు చేశారు. అప్పటికే సమావేశానికి చేరుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనసభ్యులు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి వారితో మాట్లాడారు. సమస్యల్ని నేరుగా ఆశాఖ మంత్రికే విన్నవించాలని కోరారు. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో సమావేశానికి హాజరైన సర్పంచ్‌లు తొలుత కూర్చీలపై కాకుండా నేలపై కూర్చుని నిరసన తెలిపారు. సర్పంచ్ల సమస్యలు వినేందుకే సమావేశం ఏర్పాటు చేశామని కూర్చీలపై కూర్చోవాల్సిందిగా మంత్రులు విజ్ఞప్తి చేయడంతో కుర్చీలపై కూర్చున్నారు. సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రనీల్ చందర్ సమస్యలను మంత్రికి విన్నవించారు.
ప్రత్యామ్నాయలపై దృష్టి
సర్పంచ్‌లు చెప్పిన సమస్యలు విన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ల సమస్యలు తీర్చాలంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయని, ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. చెక్‌పై ఉపసర్పంచ్ వారం రోజుల్లో సంతకాలు చేయకపోతే గ్రామపంచాయతీ తీర్మానం మేరకు మరో వార్డు సభ్యులకు చెక్ పవర్ అందించేలా గతంలోనే ఆదేశాలిచ్చినట్లు గుర్తు చేశారు. ట్రాక్టర్ల కొనుగోళ్లు, ఉపాధి హామీ నిధుల వినియోగంపై సర్పంచ్‌లకే అధికారమిచ్చామన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో మంచినీరు, విద్యుత్, పారిశుద్ధ్యం లాంటి సమస్యలు లేవని ఆ ఘనత సర్పంచ్‌లదేనన్నారు.
మరిన్ని అధికారాలు ఇచ్చే యోచనలో
కరోనా సమయంలో ఖజానా నిండుకున్నా ప్రతి నెల రూ.308కోట్లు పంచాయతీలకు ఇచ్చామని ఎర్రబెల్లి అన్నారు. కేంద్రం, ఎన్ని నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని నిధులిచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కారేనని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి వెయ్యి కోట్ల రూపాయలు రావాలని గుర్తు చేశారు. ఈజేఎస్ నిధులు రాకపోకపోయినా గ్రామపంచాయతీ నిధులు అడ్వాన్సు కింద వినియోగించుకుని, ఈజేఎస్ నిధులు వచ్చాక సర్దుబాటు చేయాలని గతంలోనే ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. శాసనసభ నడిస్తే.. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు అధికారాలిచ్చే చట్టం ఇప్పటికే ఆమోదం పొంది ఉండేదని, సర్పంచ్‌లకు మరిన్ని అధికారాలిచ్చే యోచనలో సర్కారు ఉన్నట్లు మంత్రి వివరించారు.
పాలమూరు సమాఖ్యకు రూ.15కోట్లు
నిధుల కొరత, ట్రాక్టర్ల వాయిదా చెల్లింపులు, హరితహారం లక్ష్యాలు, కొత్తరేషన్ కార్డులు, రెండు పడక గదుల ఇళ్లు, కొత్త పెన్షన్ల మంజూరు ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. అంతకుముందు కేసీఆర్ అర్బన్ ఎకో పార్కుకు వెళ్లిన మంత్రులు పార్కుపై రూపొందించిన లఘుచిత్రాన్ని తిలకించారు. మహిళ సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనలను వీక్షించారు. పాలమూరు సమాఖ్యకు రూ.15కోట్ల చెక్కు అందించారు. గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.