Telangana student died in a road accident in America : విదేశాల్లో ఉన్నత చదువులు చదివి.. ప్రయోజకుడు అవుతాడనుకున్న ఆ తల్లిదండ్రల ఆశలు గల్లంతయ్యాయి. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగొస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో వారి కుమారుడు మరణించాడు. ఇందులో విచిత్రమేమిటంటే.. కారులో అతనితో పాటు ప్రయాణించే వారందరూ ప్రాణాలతో ఉండగా దురదృష్టవశాత్తూ.. అతను మాత్రమే మరణించాడు.
భూత్పూర్ మండలం కప్పెట గ్రామానికి చెందిన బోయ మహేష్ (25) అనే యువకుడు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. కుటుంబ సభ్యులకు ఈ రోజు సమాచారం అందింది. బోయ వెంకటరాములు, శకుంతల దంపతుల ఇద్దరు కుమారులలో.. పెద్ద కుమారుడు అయిన మహేష్ అమెరికాలో ఎమ్మెస్ (ఇంజినీరింగ్) చదవడానికి గత ఏడాది డిసెంబర్‌లో అమెరికాకు వెళ్లాడు.
అక్కడి కన్ కోల్డియా యూనివర్సిటీలో చేరి తన విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి కారులో మరో ముగ్గురు మిత్రులతో కలిసి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వెళ్లే క్రమంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. మహేష్ మృతి చెందిన విషయం తెలియడంతో కప్పెట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేష్ మృతదేహాన్ని భూత్పూర్ గ్రామానికి తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కాల్పుల్లో తెలంగాణ యువతి మృతి :అమెరికాలోనిటెక్సాస్ రాష్ట్రం డాలస్ పట్టణానికి ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో గల అలెన్ ప్రీమియర్ దుకాణ సముదాయంలో శనివారం ఓ దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో మొత్తం 8 మంది మరణించగా.. అందులో సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన తాటికొండ ఐశ్వర్య(27) కూడా ఉన్నట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య షాపింగ్ చేస్తున్న సమయంలో దుండగుడు తూటాల వర్షం కురిపించాడు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదివిన ఐశ్వర్య ఆ తర్వాత 2020లో మిషిగన్ వర్సిటీలో కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ కోర్సులో పీజీ పూర్తి చేశారు. అనంతరం పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ సంస్థలో సివిల్ ఇంజినీర్‌గా చేరిన ఆమె.. ఇటీవల ప్రాజెక్టు మేనేజర్‌గా పదోన్నతి పొందారు.
ఇవీ చదవండి: