Bjp Meeting in Mahabubnagar: పాలమూరు జిల్లా ప్రస్తుతం తెరాస కంచుకోట. ఉమ్మడి జిల్లాలోని 14 శాసనసభ, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెరాస నేతలే శాసనసభ్యులుగా, ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ దత్తత తీసుకున్న జిల్లా కూడా పాలమూరే. అలాంటి జిల్లాలో పాగా వేసేందుకు భాజపా కేంద్ర నాయకత్వం ప్రస్తుతం దృష్టి సారించింది. 8 ఏళ్ల తెరాస వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, భాజపా అధికారంలోకి వస్తే ఏం చేయబోతోందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని భావిస్తోంది. అందుకు ఈ నెల 5న మహబూబ్‌నగర్ ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగే ప్రజా సంగ్రామ యాత్ర.. బహిరంగసభను వేదికగా మలచుకుంటోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభకు హాజరు కానున్నారు.
పాలమూరులో పట్టు నిలుపుకునే ఉద్దేశంతోనే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను 31రోజుల పాటు.. ఉమ్మడి జిల్లాలోనే కొనసాగేలా రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక రచించింది. ఇప్పటికే అలంపూర్, గద్వాల, మక్తల్, నారాయణపేట సహా దేవరకద్ర నియోజకవర్గాల్లో యాత్రకు, అక్కడ నిర్వహించిన బహిరంగ సభలకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. అదే ఊపుతో మహబూబ్‌నగర్‌లో నిర్వహించే సభకు లక్షమందికి పైగా జనాన్ని సమీకరించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
పాలమూరు జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాగునీరు. వెనకబడిన జిల్లాకు సాగునీరు అందించి వలసలను నివారించడంలో తెరాస వైఫల్యాన్ని సభ ద్వారా భాజపా నేతలు ప్రజలకు వివరించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి, ఆర్టీఎస్, నారాయణపేట- కొండగల్ ఎత్తిపోతల పథకం అమలుపై జాతీయ పార్టీ నేతలతో స్పష్టమైన ప్రకటన చేయించే అవకాశం ఉంది. దీనికితోడు పాలమూరు జిల్లాలో ప్రధాన సమస్యలైన అసంపూర్తి ప్రాజెక్టులు, చేనేత కార్మికుల కష్టాలు, ఇతర రాష్ట్రాలకు వలసలు, వాల్మీకి బోయలు, మాదాసి కురువలను ఎస్టీ జాబితాలో చేర్చడం, కుల వృత్తుల సమస్యలు సహా మౌలిక వసతుల కల్పనపై జాతీయ పార్టీ తరపున హామీలివ్వనున్నారు. ఇప్పటికే బండి సంజయ్ పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది.