రైతులు, యువత, మహిళలు కలలు గన్న తెలంగాణ కోసం ఇక నుంచి కాంగ్రెస్ నూతన ఒరవడితో పని చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా... సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లా కోటకదిరలో ప్రారంభించారు. సోనియా కలలుగన్న తెలంగాణ కోసం మిషన్ 2023 లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న బంగారు తెలంగాణ కూతురు, కొడుకు, అల్లుడికి మాత్రమే వచ్చింది... తప్ప ప్రజలకు రాలేదని మాణిక్కం విమర్శించారు.
కొత్త చట్టాలతో ఎవరి భూముల్లో వారే కూలీలుగా వెళ్లే దుర్గతి వస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే రాహుల్, సోనియా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేసి రైతుల భూములకు రక్షణ కల్పించినట్టు తెలిపారు. కేసీఆర్ మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం దోపిడి చేసి... అంబానీ, ఆదానీలతో పోటిపడుతోందని విమర్శించారు. 12 వేల సంతకాలు సేకరించి గవర్నర్, రాష్ట్రపతికి అందిస్తామని వివరించారు.