తెలంగాణ

telangana

By

Published : Jun 30, 2021, 4:36 AM IST

ETV Bharat / state

ONLINE CLASSES: ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆన్‌లైన్‌ పాఠాలకు దూరం..

ఆర్థిక పరిస్థితుల కారణంగా విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలకు దూరమవుతున్నారు. టీవీలు ఉంటే... కనెక్షన్లు ఉండవు... స్మార్ట్‌ఫోన్లు ఉంటే ఇంటర్‌నెట్‌ ఉండదు. నెల నెలా బిల్లులు కట్టలేక పాఠాలు వినలేకపోతున్నారు. గతేడాది 9, 10 తరగతి విద్యార్థులు మినహా ఏ తరగతుల్లోనూ 50 శాతానికి మించి ఆన్‌లైన్‌ పాఠాలు వినలేదు. జులై 1 నుంచి డిజిటల్‌ పాఠాలు చెప్పేందుకు విద్యాశాఖ సిద్ధం కాగా... విద్యార్థులకు మాత్రం అవస్థలు తప్పేలా లేవు.

online classes
ONLINE CLASSES: ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆన్‌లైన్‌ పాఠాలకు దూరం..

ONLINE CLASSES: ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆన్‌లైన్‌ పాఠాలకు దూరం..

కేజీ నుంచి పీజీ వరకూ అన్నితరగతులు ఆన్‌లైన్‌లోనే జరగాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతేడాది పూర్తిగా ఆన్‌లైన్​లోనే పాఠాలు జరిగినా... చాలామందికి బుర్రకెక్కలేదు. ఈ ఏడాది కూడా విద్యార్ధులకు ఆ తిప్పలు తప్పేలా లేవు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 3వేల 159 పాఠశాలల్లో... 2లక్షల 34వేల మంది విద్యార్ధులు చదువుతున్నారు. వీరిలో లక్షా12వేల మంది టీవీలు, 23వేల మంది సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల సాయంతో విద్య నేర్చుకున్నారు. 8వేల మంది పక్క విద్యార్ధుల సాయం తీసుకుంటే, 2వేల మంది పంచాయతీల్లో టీవీ పాఠాలు విన్నారు. 10వేల మందికి ఏ సౌకర్యమూ లేక విద్యకు దూరమయ్యారు. గతేడాది ఇంటింటా తిరిగి అవగాహన కల్పించామని... ఈసారి మరిన్ని చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

పడిపోయిన విద్యా ప్రమాణాలు

ఆన్‌లైన్ పాఠాలకు ఎక్కువ హాజరైంది 9, 10 తరగతి విద్యార్ధులే. 3 నుంచి 8 తరగతి విద్యార్ధుల హాజరు 50శాతానికి మించలేదు. ఒకటో తరగతి పూర్తి చేసిన విద్యార్ధులు ఏమీ చదువుకోకుండానే మూడో తరగతికి వచ్చారు. వీరికి ఆన్‌లైన్ పాఠాలు ఎలా అర్థమవుతాయోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. భౌతిక బోధన లేక విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి విద్యార్ధులకు జూమ్ యాప్ ద్వారా బోధించేందుకు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మెరుగైన సేవలు అందించేందుకు..

గతేడాది అనుభవాల దృష్ట్యా మెరుగైన సేవలు అందించేందుకు ఉపాధ్యాయులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతూ పిల్లలు తరగతులు వినాలని అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్ కట్టడికి కోట్లు ఖర్చుచేస్తున్న సర్కారు... విద్యార్థుల కోసం ట్యాబ్‌లు ఏర్పాటు చేసి ఇంటర్‌నెట్‌ కల్పించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. కనీసం 9, 10 తరగతి విద్యార్థులకైనా ట్యాబ్‌లు అందిస్తే మేలని అభిప్రాయపడుతున్నారు.

సర్కారు చర్యలు చేపట్టాలి..

ఇప్పటికైనా ఆన్‌లైన్ విద్యను మరింత మెరుగు పరిచేందుకు సర్కారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. చదువుకునే హక్కును ప్రతి విద్యార్ధికి చేరువ చేసేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి:Land rates: రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్​ విలువలను సవరించాలి

ABOUT THE AUTHOR

...view details