Students Are Hungry In Undavalli: మహబూబ్నగర్ జిల్లా ఉండవల్లి మండల కేంద్రమైన జడ్పీ ఉన్నత పాఠశాలకు గురువారం నెలలో మొదటి విడతగా 8.50 క్వింటాళ్ల బియ్యం సరఫరా అయ్యాయి. ఈ పాఠశాలలో 403 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. శుక్రవారం వంట ఏజెన్సీ మహిళలు బియ్యం తీసుకొచ్చి అన్నం చేసేందుకు పురమాయించారు. బియ్యంలో రాళ్లు, మెరికలు ఉండటంతో నీటిలో గాలించి తీసేందుకు చాలా సమయం పట్టింది. అంతేకాక బియ్యం నాణ్యత కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇలా గత మూడు నెలల నుంచి బియ్యం సరఫరా అవుతుండటంతో వంట ఏజెన్సీ మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక గతంలో రెండు పర్యాయాలు నాణ్యతలేని బియ్యాన్ని వెనక్కి పంపించినట్లు తెలిపారు. ప్రతిరోజు భోజనాన్ని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు రుచి చూస్తున్నప్పటికీ ఇలాంటివి చోటు చేసుకోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్థులు వాపోయారు.
జిల్లా వ్యాప్తంగా 461 ప్రభుత్వ పాఠశాలలు, 12 కేజీబీవీ, 13 గురుకుల విద్యాలయాలుండగా 70 వేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతినెల పాఠశాలలకు 700 క్వింటాళ్లకు పైగా బియ్యం సరఫరా అవుతున్నాయి. అయితే విద్యార్థులకు సరఫరా అయ్యే బియ్యం నాణ్యతగా లేకపోవడంతో పాటు అందులో రాళ్లు, మెరికల్లాంటివి వస్తున్నాయని వంట ఏజెన్సీ వారు పేర్కొంటున్నారు. అంతేకాక భోజనం చేసే విద్యార్థులు సైతం అవస్థ పడుతున్నట్లు వాపోతున్నారు. నాణ్యమైన బియ్యం సరఫరా లేనందున విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల వడ్డేపల్లి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఒకేసారి ఆరుమంది విద్యార్థులు వాంతులతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
"నాసిరకం బియ్యాన్ని వెనక్కి పంపించాం: గతంలో రెండు మూడుసార్లు పాఠశాలకు వచ్చిన నాసిరకం బియ్యాన్ని వెనక్కి పంపించాం . బియ్యం లో రాళ్లు మెరికలు వంటివి వస్తే ఆహార తయారీకి ఆలస్యమవుతుంది. బియ్యం నాణ్యత లేకపోవడంతో అన్నం ముద్దగా మెత్తగా అవుతుంది. నాణ్యత లేని బియ్యంతో వంట ఏజెన్సీ వారికి భోజనం చేసిన విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు .ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. సమస్యను పరిష్కరిస్తాం." - శివప్రసాద్, ఉండవల్లి, మానపాడు మండల విద్యాధికారి