Vijayalakshmi inspiring story in Mahabubnagar : ఆడపిల్లంటే సమాజంలో అదోరకమైన చులకన భావం. కాలం, సమాజం మారుతున్నా వారిపట్ల వివక్ష పోవడం లేదు. అమ్మాయిలకు చదువెందుకు, ఉద్యోగాలెందుకు, మగాళ్లు లేకుండా మహిళలు ఏం సాధించగలరనే భావన ఇప్పటికీ చాలామందిలో ఉంటుంది. మహబూబ్ నగర్‌కి చెందిన విజయలక్ష్మి భర్త సైతం అలాగే ఆలోచించారు. వారికి ముగ్గురూ ఆడపిల్లలు. మొదటి ఇద్దరు చదువుకుంటున్నప్పుడే వాళ్లకు చదువులెందుకంటూ వాదించేవాడు. మూడో సంతానం కూడా ఆడపిల్లే కావడంతో, మగసంతానం కోసం రెండోపెళ్లి చేసుకుంటానని విజయలక్ష్మిని ఒప్పించే ప్రయత్నం చేశారు. కాని ఆమె అంగీకరించలేదు. దీంతో కట్టుకున్న భార్యను, కన్నబిడ్డల్ని వదిలేసి వెళ్లిపోయాడు.
ఇడ్లీ టు ఆలు చిప్స్ వరకు: భర్త వెళ్లిపోయాడని విజయలక్ష్మి ఏ మాత్రం జంకలేదు. ఆడపిల్లల్ని చదవించి తీరాలనే పట్టుదలలో అహర్నిశలూ శ్రమించారు. పెళ్లైన కొత్తలో టైలరింగ్ చేసిన ఈమె, మూడో కాన్పు శస్త్రచికిత్స కావడంతో.. టైలరింగ్ వదిలి ఇడ్లీల వ్యాపారం మొదలుపెట్టారు. దీంతో కాస్త ఆదాయం పెరిగింది. ఆ తర్వాత కారా, బూందీ, మిక్చర్ లాంటివి తయారు చేసి అమ్మేవారు. వాటిని భర్త అమ్ముకుని వచ్చేవాడు. భర్త వదిలి వెళ్లిపోయాక ఆలోచనలో పడ్డారు. ఆలూ చిప్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు.
స్టార్టప్ ఇండియా పథకం సహాయం: కిలో నుంచి రోజుకు 300 కిలోల చిప్స్ తయారు చేసేంతగా వ్యాపారాన్ని విజయలక్ష్మి పెంచారు. ఆ తర్వాత 'స్టార్టప్ ఇండియా' పథకం కింద కేంద్రం రాయితీ రుణం 22లక్షలతో జిల్లాలోని పోల్కంపల్లిలో ఆలూ చిప్స్ పరిశ్రమ నెలకొల్పారు. ఏటా 50-60 లక్షల విలువైన వ్యాపారం చేస్తున్న విజయలక్ష్మీ.. ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకోవాలన్నది కోరిక అని చెప్పారు.