మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న 'టచ్ స్వచ్ఛంద సంస్థ' ఆశ్రమంలో 64 మంది బాలబాలికలు ఉంటున్నారు. సినీ దర్శకుడు నాగ అశ్విన్ ఆలోచన మేరకు ఆశ్రమ భవనం నిర్మాణానికి పూనుకున్నారు. 133 గజాలలో 40 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పులో భవన నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు.
6వేల ప్లాస్టిక్ బాటిళ్లతో...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సేకరించిన 6 వేల ఖాళీ శీతల పానియాల సీసాలను సేకరించారు. అనంతరం వాటిని శుభ్రపరిచి మూతలను సమకూర్చారు. కింది భాగంలో విశాలమైన హాలు నిర్మాణం చేసేందుకు పది అడుగుల లోతు తవ్వి గ్రానైట్ రాళ్లతో సెల్లార్ నిర్మాణం చేపట్టారు. నాలుగు పిల్లర్ల ద్వారా 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవులో సిమెంట్ కాంక్రీట్ స్లాబ్ వేశారు. అనంతరం గోడల నిర్మాణంలో భాగంగా 14 అంగుళాల మందంతో వచ్చేటట్టుగా రెండు వరుసలుగా ప్లాస్టిక్ బాటిళ్లను ఇసుక, మట్టితో పేర్చి మధ్యలో సిమెంటు కాంక్రీట్ వేసి గోడలు నిర్మించారు.
సహజ సిద్ధంగా...
సీసాలపై బరువు పడకుండా మధ్యలో ప్రతి నాలుగు అంగుళాలకు ఇనుప చువ్వలు, కాంక్రీట్‌తో బెడ్ వేశారు. తక్కువ సీసాలు వినియోగించే విధంగా పెద్ద పరిమాణంలో గుండ్రని ఆకారంలో కిటికీలను ఏర్పాటు చేశారు. అందుకు నీటి ట్యాంక్‌ల నిర్మాణంలో ఉపయోగించే సిమెంట్ రింగ్‌లను వాడి అద్దాలు బిగించారు. ఇరువైపుల గోడలను ఈ విధంగానే ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ బాటిళ్లతో నిర్మించిన గోడలకు బయటి వైపు ఇరువైపుల ప్లాస్టింగ్ చేయలేదు. సహజ సిద్ధంగా అందంగా కనిపిస్తున్నాయి.