తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగని కృత్రిమ ఇసుక దందా... అధికారులకు పట్టింపు కరవు.. - మహబూబ్​నగర్​ జిల్లాలో ఇసుక దందాపై ప్రత్యేక కథనం

అక్రమార్కుల ఇసుక దాహం ఆగడం లేదు.. ఇటు నదీ పరీవాహకాలు.. అటు వాగులు వదలని వ్యాపారులు ఫిల్టర్‌ ఇసుక వ్యాపారాన్నీ కొనసాగిస్తున్నారు.. మట్టి నుంచి ఇసుక తీసి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.. ఉమ్మడి జిల్లాలో ఏడు ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌ల నుంచే రవాణాకు అనుమతి ఉన్నా.. మిగతా ప్రాంతాల్లోనూ ఇసుక తీసి తరలిస్తున్నారు..

special story on Sand Mafia at mahabubnagar district
ఆగని కృత్రిమ ఇసుక దందా... అధికారులకు పట్టింపు కరవు..

By

Published : Jul 31, 2020, 6:48 PM IST

మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం తిర్మలాపూర్‌ శివారులో బుధవారం రాత్రి ఫిల్టర్‌ ఇసుకను తీసుకెళ్తున్న లారీ ఢీ కొట్టిన సంఘటనలో రైతు గుర్రంకాడి నర్సింహులు మృతి చెందిన సంఘటన సంచలనం సృష్టించింది. అక్రమ కార్యకలాపాలు ఎవరి కంటపడవద్దని ఆ వ్యాపారి ఇసుక తరలింపునకు రాత్రి సమయం ఎంచుకోవడం ఓ ప్రాణాన్ని బలిగొంది. వివిధ శాఖల నిఘా లోపం అక్రమార్కులకు వరంగా మారిన వైనం బట్టబయలైంది. వాగులు, నదీ పరివాహక ప్రాంతాల్లో పుష్కలంగా దొరికే ఇసుక నిల్వలు అక్రమ తవ్వకాలతో తరిగిపోతున్నాయి. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కృత్రిమ ఇసుకను తయారు చేసి విక్రయిస్తున్నారు. కృత్రిమ ఇసుక తయారీ ఎక్కువగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగుతోంది. మహబూబ్‌నగర్‌ గ్రామీణం, రాజాపూర్‌, బాలానగర్‌, నవాబుపేట మండలాల్లో ఫిల్టర్‌ ఇసుక కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటి నిర్వాహకులు రాత్రి వేళల్లో ఇసుకను తరలిస్తున్నారు.

పరీవాహకాల నుంచీ.. : ఉమ్మడి జిల్లాలోని నదీ పరీవాహకాలు, వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ప్రవహిస్తున్న దుందుభి వాగులో నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వాగులోకి నీరు రాకపోవడంతో ఇసుక తరలింపునకు అడ్డులేకుండా పోతుంది. వనపర్తి జిల్లాలో ప్రవహిస్తున్న ఊకచెట్టు, జగత్‌పల్లి, తెల్లరాళ్లపల్లి వాగులు, జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రవహిస్తున్న తుంగభద్ర నది పరీవాహక ప్రాంతం నుంచి నీరు రాని ప్రాంతాల్లో నుంచి ఇసుక రవాణా సాగుతోంది. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం నాగిరెడ్డిపల్లి, ముశ్రీఫా, బోగారం, బిజ్జారం, కడెంపల్లి వాగులు, మద్దూరు మండలం లింగాల్‌చేడ్‌, పెద్దాపూర్‌ వాగులు, మక్తల్‌ మండలం సంగంబండ, చిట్యాల, పసుపుల వాగులు, మరికల్‌ మండలం పూసలపాడు, జిన్నారం, గోటూరు వాగుల్లో నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఇటీవలే కురిసిన వానలకు, ఎగువ నుంచి వచ్చిన వరద కారణంగా కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు నిలిచిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో యథేచ్ఛగా దందా సాగుతోంది.

అనుమతి పేరుతో అక్రమాలు :ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న ప్రాంతాల్లో చాలా మంది ఇసుక వ్యాపారులు వివిధ అభివృద్ధి పనుల పేరుతో అనుమతి తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్ని ట్రిప్పులు తరలించినా ఒకే వే బిల్లు చూపిస్తూ తమ దందాను కొనసాగిస్తున్నారు. యంత్రాంగాన్ని మామూళ్ల మత్తులో ముంచుతూ అక్రమ వ్యాపారం చేస్తున్నారు. వివిధ అభివృద్ధి పనులు, కొందరికి వ్యక్తిగత అవసరాల కోసం అనుమతులు ఇస్తున్నామని మైనింగ్‌, రెవెన్యూ శాఖల అధికారులు పేర్కొంటున్నారు. రాత్రి వేళలో ఇసుక తరలింపును పూర్తిగా అడ్డుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని పోలీసుశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం యంత్రాంగం నిర్లిప్తతతో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.

ఉమ్మడి జిల్లాలో అనుమతి ఉన్న రీచ్‌లు

ప్రాంతం మండలం జిల్లా

  • పెద్ద ధన్వాడ రాజోలి జోగులాంబ గద్వాల
  • చిన్న ధన్వాడ రాజోలి జోగులాంబ గద్వాల
  • తుమ్మిళ్ల రాజోలి జోగులాంబ గద్వాల
  • ర్యాలంపాడు అలంపూర్‌ జోగులాంబ గద్వాల
  • సూరారం వాగు కోయిలకొండ మహబూబ్‌నగర్‌
  • కొత్తపల్లి మిడ్జిల్‌ మహబూబ్‌నగర్‌
  • అడివి సత్యవార్‌ మాగనూరు నారాయణపేట

ఇదీ చూడండి:భారత్​కు రఫేల్​- వాయుసేనకు కొత్త శక్తి

ABOUT THE AUTHOR

...view details