పత్తి పండించిన రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడకుండా వచ్చిన రోజే పత్తి అమ్ముకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న టోకెన్ల జారీ విధానం గందరగోళానికి కారణమవుతోంది. పండించిన పత్తిని ఎప్పుడు అమ్ముకోవాలో.. ఎక్కడ అమ్ముకోవాలో సూచిస్తూ.. వ్యవసాయ అధికారులు వారి వారి క్లస్టర్ల వారీగా టోకెన్లు జారీ చేస్తారు. అందులో రైతు ఊరు, పేరు, విస్తీర్ణం సహా కొనుగోలు కేంద్రం పేరు, పత్తిని తీసుకువెళ్లాల్సిన తేదీని సైతం స్పష్టంగా పేర్కొనాలి. అలా ఒక్కో సీసీఐ కేంద్రానికి ఒక్క రోజుకు 60 నుంచి 70 టోకెన్లు మాత్రమే జారీ చేయాలి. కానీ పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చన్న పేరుతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వ్యవసాయ విస్తరణాధికారులు.. కనీస వివరాలు లేకుండా.. సంతకం, స్టాంపు వేసి టోకెన్లు జారీ చేస్తున్నారు. పత్తి అమ్ముకునే అవకాశం వచ్చినప్పుడు.. తేది, కొనుగోలు కేంద్రం వాళ్లనే రాసుకోమని సూచిస్తున్నారు. అలాంటి టోకెన్లు పట్టుకుని సీసీఐ కేంద్రాలకు వెళ్తున్న రైతులు పడిగాపులు పడుతున్నారు.
బారులు తీరిన వాహనాలు
మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మండలం అప్పాయిపల్లి సీసీఐ కేంద్రం వద్ద సోమవారం 200 పైగా వాహనాలు బారులు తీరాయి. వాటిలో 9న టోకెన్లు పొందిన రైతుల పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లావి మాత్రమే కాకుండా నారాయణపేట జిల్లా నుంచి సైతం రైతులు టోకెన్లతో వచ్చారు. వాస్తవానికి ఒక సీసీఐ కేంద్రం పరిధిలో చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి రోజుకు 60 నుంచి 70 టోకెన్లు మాత్రమే జారీ చేయాలి. కానీ ఇతర మండలాలు, ఇతర జిల్లాల నుంచి కూడా రైతులకు టోకెన్లు జారీ చేయడం, వాళ్లంతా ఒకే సీసీఐ కేంద్రానికి రావడంతో పత్తి అమ్ముకునేందుకు పడిగాపులు పడాల్సి వస్తోంది. పైగా నారాయణపేట జిల్లాలో తిప్పరాసుపల్లి వద్ద సీసీఐ కేంద్రం ఉంది. కానీ 16న వరకూ టోకెన్లు అయిపోయాయి. దీంతో అక్కడి రైతులు మహబూబ్ నగర్ జిల్లా అప్పాయిపల్లికి వస్తున్నారు. ఒకే కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి టోకెన్లతో ఎక్కువ మంది రైతులు రావడంతో వాహనాలు బారులు తీరుతున్నాయి.