మహబూబ్నగర్ జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న ఈ బియ్యాన్ని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఈనెలలో బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటికే 20 కేసులు నమోదయ్యాయి.
గ్రామాల్లో కొందరు వ్యాపారులు పేదల నుంచి కిలోల చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేసి.. మిల్లర్లకు అమ్ముతున్నారు. మిల్లర్లు ఈ బియ్యాన్ని పాలిష్ పట్టించి.. టోకు వర్తకులకు రూ.20కు అమ్ముతున్నారు. మరికొందరు మిల్లర్లు సీఎంఆర్ కింద ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని బయటి వ్యక్తులకు అమ్ముకుంటూ.. ఆ బియ్యం స్థానంలో పీడీఎస్ బియ్యాన్ని ఇస్తున్నారు. జడ్చర్లలో ఇటీవల పట్టుబడ్డ ఒక వ్యాపారి 20 లారీల వరకు అక్రమ రవాణా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల వెలుగు చూసిన అక్రమాలు..
జడ్చర్ల మండలం నాగసాల సమీపంలోని రైస్ మిల్లులో ఈనెల 17, 18 తేదీల్లో అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 130 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. జడ్చర్లలో ఓ వ్యాపారి ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్లో ఈనెల 2న డీసీఎంలో తరలిస్తున్న బియ్యం పట్టుకున్నారు. మూడు నెలల క్రితం నవాబుపేటలో అక్రమంగా లారీల్లో తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇటీవలే తరచూ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతోన్న జడ్చర్లకు చెందిన ఓ వ్యాపారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ప్రజల్లో మార్పు రావాలి..
పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి బియ్యాన్ని అందిస్తోందని.. వాటిని ఎవరూ అమ్ముకోవద్దని జిల్లా పౌర సరఫరాల అధికారి వనజాత పేర్కొన్నారు. ఇటీవల వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ప్రజా పంపిణీ బియ్యం సుమారు 200 క్వింటాళ్ల వరకు పట్టుకున్నామని తెలిపారు. ఈ రవాణాపై నిఘా పెంచామని.. అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ఈ అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టగలుగుతామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి.. పత్తి కొనుగోళ్ల తూకంలో తేడాతో రైతుల ఆందోళన