ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు దిల్లీ, ముంబయి, గోవా నుంచి వచ్చిన పలువురుని పోలీసులు గుర్తించారు. మహబూబ్ నగర్ పట్టణానికి దిల్లీ నుంచి ఓ యువ వైద్యుడు, ముంబయి నుంచి ఇద్దరు, గోవా నుంచి ఇద్దరు పాలమూరుకు రాగా వారిని వైద్యాధికారులకు అప్పగించారు. వారికి కరోనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకున్న వైద్యాధికారి.. వివరాలు నమోదు చేసుకుని వారిని స్వస్థలాలకు పంపించి వేశారు. అందులో ఇద్దరు మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన ధ్రువపత్రాలను చూపించారు.
కొవిడ్-19 లక్షణాలు ఉన్నా లేకపోయినా... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు కరోనా సోకకుండా 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంటే మేలని వైద్యులు సూచించారు. సేకరించిన వారి వివరాలను సంబంధిత రెవిన్యూ, వైద్యారోగ్య, పంచాయతీ అధికారులకు తెలియజేస్తామని వైద్యులు తెలిపారు. ముంబయి నుంచి నారాయణ పేట జిల్లాకు వచ్చిన వారికి సైతం అక్కడి అధికారులు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి స్వస్థలాలకు పంపించి వేశారు.