మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన చెన్నయ్య 2020లో తన తండ్రిభూమిని ముగ్గురు అన్నదమ్ములతో వారసత్వంగా పట్టా చేయించుకున్నారు. ధరణిలో ఎవరి భూములు వారికి నమోదయ్యాయి. కానీ ఇప్పటికి పాస్ పుస్తకం మాత్రం చేతికందలేదు. దీని కోసం చెన్నయ్య ఇప్పటికీ ఎన్నోసార్లు కలెక్టర్ కార్యాలయం, మండల తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. చెప్పిందల్లా చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసి తన భూమికి పాస్ పుస్తకం లేదు. రైతుబంధు(raithubandhu) రావడం లేదు.
2020లో మా తండ్రి గారి పేరు మీదున్న భూమిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు పాసు పుస్తకాలు రాలేదు. ఎమ్మార్వోతో పాటు కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. పాసు పుస్తకం వస్తేనే రైతుబంధు వచ్చే పరిస్థితి ఉంది. -చెన్నయ్య, ఇబ్రహీంపల్లి, రాజాపూర్ మండలం
మిగిలిన భూమి పరిస్థితి ఏంటి..
బాలనగర్ మండలం మొదంపల్లి గ్రామానికి చెందిన నడిమింటి మైసయ్య ఎకరం 14 గుంటల భూమికి పాస్ పుస్తకం రావాలి. కాని ఏడు గుంటలకు మాత్రమే ధరణిలో పాస్ పుస్తకం వచ్చింది. ఆ భూమికే రైతు బంధు వస్తోంది. మిగిలిన ఎకరం 7 గుంటల పరిస్థితి ఏమిటని మైసయ్య అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఐదు సార్లు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కావాల్సిన అన్ని దస్త్రాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. మూడేళ్లుగా ఆయన సమస్య పరిష్కారం కాలేదు. గౌస్ పాషాది సైతం అదే దుస్థితి. 2019 వరకూ ఉన్న 3.07 గుంటలకు రైతుబంధు అందింది. ఆ తర్వాతే ఆన్ లైన్ 20 గుంటల భూమి చూపుతోంది.
ఎకరం 14 గుంటల భూమికి పాస్ పుస్తకం రావాలి. కాని ఏడు గుంటలకు మాత్రమే ధరణిలో పాస్ పుస్తకం వచ్చింది. ఆ భూమికే రైతు బంధు వస్తోంది. మిగిలిన ఎకరం 7 గుంటలకు పాస్‌పుస్తకం రాలేదు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా. -నడిమింటి మైసయ్య, పెద్దరేవుల