మహబూబ్‌నగర్ జిల్లా మన్యం కొండ పరిసర ప్రాంతాల్లో చిరుతల సంచారం అక్కడ వారిని ఆందోళనకు గురిచేస్తోంది. పది రోజుల వ్యవధిలో నాలుగైదుసార్లు చిరుతల సంచారాన్ని చూశామని స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సిబ్బంది ఆ ప్రాంతంలోని గుట్టలు, కుంటల వద్ద చిరుత పాదముద్రల కోసం వెతికారు. రెండు చిరుతలకు సంబంధించిన ఆనవాళ్లు దొరికాయి. చిరుతల సంచారాన్ని నిర్ధారించిన అధికారులు... మన్యంకొండ అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా అడవుల్లో.. పశువుల్ని మేత కోసం తీసుకెళ్లవద్దని హెచ్చరించారు.
ఏడు చిరుతలున్నాయ్..
మన్యంకొండ అటవీ ప్రాంతంలో 7 చిరుతలు ఉన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. అవి ఆహారం కోసం రోజూ 40 కిలోమీటర్ల అడవిలో ప్రయాణిస్తాయన్నారు. దాహం తీర్చుకునేందుకు నీళ్లు ఎక్కడుంటే అక్కడికి వస్తాయని తెలిపారు. ఈ సందర్భంలో స్థానికుల కంట పడుతున్నాయన్న అధికారులు.. చిరుతల వల్ల రైతులు నష్టపోతే పరిహారం చెల్లిస్తామని చెబుతున్నారు. వాటి ప్రాణహాని ఉందని భావిస్తే... వాటిని బంధించి మరో చోటుకి తరలిస్తామని స్పష్టం చేశారు.