తెలంగాణ

telangana

ETV Bharat / state

సమస్యల్లో సర్కారీ బడులు... ఖాళీ అవుతున్న 'సార్​'ల జేబులు! - sanitation problems

మరుగుదొడ్లు, మూత్రశాలలున్నా.. వాటిని శుభ్రం చేసేవాళ్లు లేకపోతే.. పరిస్థితేంటి? ప్రస్తుతం అలాంటి దుస్థితినే సర్కారు బడులు ఎదుర్కొంటున్నాయి. స్కావెంజర్లు లేక టాయిలెట్లు కంపుకొడుతున్నాయి. నిబంధనలు పాటిస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్ని తెరచిన విద్యాశాఖ.. ఆ తర్వాత నిర్వాహణలో ఎదురవుతున్న ఇబ్బందులను మాత్రం గాలికొదిలేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ బళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కథనం.

sanitation problems in government schools in mahaboobnagar
sanitation problems in government schools in mahaboobnagar

By

Published : Oct 6, 2021, 7:24 PM IST

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెరిచిన విద్యాశాఖ... నిర్వాహణలో ఎదురవుతున్న ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదు. వందల సంఖ్యలో విద్యార్థులుండే ఉన్నత పాఠశాలల్లో.. స్వీపర్లు, స్కావెంజర్లు, అటెండర్లు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఈ దుస్థితి నెలకొంది. సెప్టెంబర్ 1 నుంచి బళ్లు ప్రారంభమయ్యాయి. వాటి పారిశుద్ధ్య బాధ్యతల్ని స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ సిబ్బందే బళ్లను శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తొలినాళ్లలో కాస్త దృష్టి పెట్టిన పారిశుద్ధ్య సిబ్బంది ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. వారానికి ఒకటి రెండు రోజులు, కొన్నిచోట్ల నెలలో ఒకటి రెండు రోజులు వెళ్లి పాఠశాలలను శుభ్రం చేస్తున్నారు. పరిసరాలను, గదులు ఊడుస్తున్నా.. మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రం చేయడం లేదు. వందల సంఖ్యలో విద్యాద్థులుండే బళ్లల్లో అవి కంపు కొడుతున్నాయి. భరించలేక.. ఉపాధ్యాయులే తలా కొంత డబ్బులు వేసుకుని స్కావెంజర్లను, స్వీపర్లను నియమించుకుని శుభ్రం చేయిస్తున్నారు.

సార్లపైనే భారం..

గతంలో 100మంది విద్యార్థులకొక స్కావెంజర్​ను నియమించి ఒక్కొక్కరికి రెండున్నర వేలు చెల్లించేవారు. ప్రస్తుతం స్కావెంజర్లు లేక విద్యార్థుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు, మూత్రశాలలు కంపుకొడుతున్నాయి. స్థానిక సంస్థల సిబ్బంది వాటి జోలికి వెళ్లడం లేదు. ఇక స్వీపర్లు, అటెండర్లు కూడా లేక గదుల శుభ్రత, పరిసరాల శుభ్రత, పాఠశాల నిర్వాహణ కూడా ఉపాధ్యాయులకు భారంగా మారుతోంది. ఉపాధ్యాయులు సొంత డబ్బులు వేసుకుని ఇచ్చే కొద్దివేతనం వారికి సరిపోవడం లేదు. ఒకటి రెండు నెలలంటే సర్దుబాటు చేస్తాం గాని.. నెలల తరబడి కష్టమంటున్నారు. ఇక కొవిడ్ నిబంధనల అమలు కోసం శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాల్సివస్తోంది. వీటికి ప్రత్యేకంగా ప్రభుత్వం నిధుల కేటాయించలేదు. ఉన్న కాంటెంజెన్సీ నిధుల నుంచే వాడుకోవాలని సూచిస్తోంది. ఇవి కాకుండా కాకుండా.. గదుల కొరత, ఉపాధ్యాయుల కొరత.. కనీస వసతుల లేమి.. సర్కారు బళ్లను వేధిస్తున్నాయి. విద్యావాలంటీర్లను సైతం విధుల్లోకి తీసుకోలేదు.

భోజనంలో కోత..

విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనం సైతం నాణ్యంగా ఉండటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూరగాయలు, ఆకుకూరలు సహా పప్పులు, నూనెలు, గుడ్ల ధరలు పెరగాయి. వాటికి అనుగుణంగా ప్రభుత్వం వంట ఏజెన్సీలకు చెల్లించే మొత్తాన్ని మాత్రం పెంచలేదు. దీని వల్ల ఏజెన్సీలు నష్టపోతున్నాయి. ముఖ్యంగా తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న పాఠశాలల్లో వంట ఏజెన్సీలకు గిట్టుబాటు కావడం లేదు. ఫలితంగా.. మెనూ పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదో తరగతిలోపు చిన్నారులకు ఒక్కొక్కరికి 4 రూపాయల 97 పైసలు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 7 రూపాయల 45 పైసలు ప్రభుత్వం చెల్లిస్తోంది. గుడ్డు ఉన్నరోజు ఒక్కో విద్యార్థికి 9 రూపాయల 45 పైసలు చెల్లిస్తున్నారు. గుడ్ల ధర బహిరంగ మార్కెట్​లో ఐదు రూపాయలు పలుకుతోంది. ప్రభుత్వం మాత్రం 4 రూపాయలు కూడా చెల్లించడం లేదు. దీని వల్ల వారానికి మూడు గుడ్లు ఇవ్వాల్సిన చోట.. ఒకటి రెండు గుడ్లిచ్చి సరిపెడుతున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్కావెంజర్లు, స్వీపర్లను తక్షణం నియమించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వంట ఏజెన్సీలకు తాజా ధరలకు అనుగుణంగా చెల్లించే బిల్లులను పెంచాలనే సూచనలు సైతం వస్తున్నాయి.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details