sand transport problems : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక కోసం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీకావు. ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక కోసం రూ.5వేలు ఖర్చు చేస్తే.. ప్రస్తుతం 10వేలు చెల్లించాల్సి వస్తోంది. డబ్బుపెట్టినా సమయానికి దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా, తుంగభద్ర, భీమా పరివాహక ప్రాంతాలు, ఊకచెట్టు వాగు, దుందుబీ వాగు, పెద్దవాగు ఇలా చాలాచోట్ల కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉంది. కానీ ప్రభుత్వశాఖల ద్వారా సహేతుక ధరల్లో ప్రజలకు సరఫరా లేకపోవడంతో జనం దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఇసుక అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.
ఇసుకకు భారీ డిమాండ్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 11చోట్ల ఇసుక రీచ్‌లను గుర్తించి తవ్వి అమ్మేందుకు ఒప్పందాలు జరిగాయి. స్థానికంగా ప్రజల నుంచి వ్యతిరేకత, నీళ్లు నిలిచి ఉండటం, ఒప్పందాల గడువు ముగియడం వంటి కారణాలతో అన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా ఆవంచ మినహా ఎక్కడా ఇసుక అమ్మకాలు జరగడం లేదు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇసుక ఉప నిల్వ కేంద్రంలో సుమారు 1200 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నా... ఆర్నెలుగా ఈ కేంద్రం మూతపడి ఉంది. ఇసుకకు భారీ డిమాండ్ ఉన్న ఈ తరుణంలో బుకింగ్‌లు లేవని అధికారులు చెబుతున్నారు. పేరుకు తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అధికారులు చెబుతున్నా.. ఆ వెబ్‌సైట్లు సరిగా పనిచేయడం లేదని, సాంకేతిక కారణాలతో బుకింగ్‌లు కావడం లేదని జనం ఆరోపిస్తున్నారు.
ఇంటి నిర్మాణం చేసుకునే వారికి ఇసుక వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. వాటివల్ల నిర్మాణాలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇసుక లభ్యత ఉన్నప్పటికీ తిప్పలు తప్పడం లేదు. కొంతమంది దళారీలు ఎక్కువ ధరకు ఇసుకను అమ్ముకోవడం వల్ల... సామాన్యులు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక కోసమే రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
-వినియోగదారులు
మస్త్ రేట్లు పెరిగినయి. గతంలో రూ.5,500కు ఇసుక వచ్చేది.ఇప్పుడు ఒక ట్రాక్టర్‌కు రూ.10వేలు పడుతుంది. బిల్డర్లు, వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బిల్డింగుల నిర్మాణం ఆపేస్తున్నారు. మా లేబర్‌కు చాలా ఇబ్బందిగా మారింది.