Thagulla Gopal: దండకడియం కవితా సంకలనానికి ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పాలమూరు మట్టికి, తాను పుట్టిన ఊరుకి అంకితమని అవార్డు గ్రహీత తగుళ్ల గోపాల్ అన్నారు. పురస్కారం దక్కిన సందర్భంగా ఆయన ఈటీవీ భారత్తో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన తగుళ్ల గోపాల్ 1992లో కృష్ణయ్య, ఎల్లమ్మ దంపతులకు జన్మించారు. ఐదో తరగతిలో చదువు మానేసి పశువులు కాస్తున్న తరుణంలో అదే గ్రామానికి చెందిన రాజవర్ధన్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు గోపాల్ తల్లిదండ్రులను ఒప్పించి బడి మానివేయకుండా చూశారు. ఉదయం సాయంత్రం పశువులు కాస్తూనే ఆరేడు తరగతులు పూర్తి చేశారు. 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు నాగార్జున సాగర్ బీసీ హాస్టల్లో ఉండి చదువుకున్నారు.
కవితా ప్రయాణం.. అలా మొదలు..
చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడు కావాలనుకున్న గోపాల్ డీఎడ్ చేసి 2012లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నియమితులయ్యారు. ప్రస్తుతం వెల్దండ మండలం అజిలాపూర్లో ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలందిస్తున్నారు. హైదరాబాద్లో ఓ సదస్సులో నారాయణశర్మ రాసిన 'అస్థిత్వ పుష్పాలు' పుస్తకం చదివాక గోపాల్ నానీలు రాయడం ప్రారంభించారు. సమాజంలో అసమానతలు, పేదరికంపై సరళమైన భాషలో కవిత్వం రాయడం ఆయన శైలి. 2016లో తీరొక్కపువ్వు నానీల సంపుటి వెలువరించారు. గ్రామీణుల జీవితాలు, వృత్తులు, పేదలు జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకులను దండకడియంలో పొందుపరిచారు.
పేరు తెచ్చిన కవితలు