Rythu Runamafi 2023 Issues in Mahabubnagar PACS : ఉమ్మడి పాలమూరు జిల్లాలో.. సహకార సంఘాల ద్వారా పంట రుణాలు పొందిన రైతులకు రుణమాఫీ అమలులో తీవ్రజాప్యం జరుగుతోంది. వాణిజ్య బ్యాంకుల ద్వారా.. పొందిన వారికి ప్రక్రియ వేగవంతంగా పూర్తికాగా, సహకార సంఘాల ద్వారా పంటరుణాలు పొందినవారి ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. లక్షలోపు రుణం ఉన్న రైతులు రుణమాఫీ వర్తింపు సమాచారం కోసం సహకార సంఘాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది.
Farmers Face Loan Debt Problems :ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సహకార సంఘాలు.. ఆన్‌లైన్ పోర్టల్‌లో అర్హుల వివరాలు పొందుపర్చినా అందరికీ అమలుకాక అర్హులు ఆవేదనకు గురవుతున్నారు. ఒకే కుటుంబం నుంచి ఎక్కువమంది పంటరుణం తీసుకుంటే వారిలో ఒకరికి లేదా లక్షలోపు మాత్రమే మాఫీ వర్తిస్తోంది. గతంలో సహకార సంఘాల సిబ్బందిని తప్పుదోవ పట్టించి పంటరుణం లేనట్లు ధ్రువీకరణ పత్రం పొంది ఇతర వాణిజ్య బ్యాంకుల్లో రుణం పొందిన రైతులకు.. ఇప్పుడు సహకారసంఘాల్లో రుణాలు మాఫీ కావడం లేదు.
Rythu Runamafi Issues :దీంతో రైతులుసహకారసంఘాల చుట్టూ తిరుగుతున్నారు. మక్తల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 2018 డిసెంబర్ నాటికి 557 మంది లక్షలోపు రుణాలు పొందగా 249 మందికే రుణమాఫీ డబ్బులు జమయ్యాయి. మాగనూరు పీఏసీఎస్‌లో.. 1282 మందిలో 675 మందికే రుణమాఫీ వర్తించింది. ఉట్కూరులో 756 మందిలో 395మందికి మాఫీ డబ్బులు రాగా మిగిలిన వారికి ఇంకా జమకాలేదు.
Mahabubnagar PACS Crop Wavier 2023 Issues :ఏ సహకార సంఘం పరిధిలో చూసినా 40 నుంచి 50 శాతం వరకు మాత్రమే రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయి. అయితే అధికారులు మాత్రం ఇతర బ్యాంకుల్లో రుణం ఉన్నా.. రాకపోవచ్చని చెబుతున్నారు. పూర్వ మహబూబ్‌నగర్‌లో 78 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వాటిని 22 డీసీసీబీ శాఖల ద్వారా నిర్వహిస్తున్నారు. ఆ బ్యాంకుల్లో 69 వేల మంది 292 కోట్ల పంటరుణాలు పొందగా.. వారిలో 39వేల మందికి 149కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి.