Government Will Repair Rural Roads: 'రాష్ట్రంలోని రహదారులు అద్దాల్లా ఉండాలి. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. వానలకు పాడైపోయిన రహదారులను నెలన్నరలోగా బాగు చేయాలి. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.' అని ఇటీవల సంబంధిత శాఖ మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే పల్లె రోడ్లకు మహర్దశ పట్టనుంది. వరదల కారణంగా కోతకు గురైన, దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు మోక్షం కలగనుంది. భారీ వర్షాలకు వరద నీరు వాటిపై నుంచి పొంగిపొర్లడంతో కోతకు గురయ్యాయి. కల్వర్టులు దెబ్బతిన్నాయి.
ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, నర్సింహులపేట, పెద్దవంగర, కొత్తగూడ, మరిపెడ, డోర్నకల్ ప్రాంతాల్లో కోతకు గురైన రోడ్లు ప్రమాదకరంగా మారాయి. ఇవే కాకుండా గుంతలు పడిన వాటిని సైతం బాగు చేస్తారు. చాలా వరకు రోడ్లు కొత్తగా కనిపించేలా పూర్తిస్థాయిలో తారు వేయనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దీంతో పల్లె ప్రాంతాల్లోని రోడ్లు బాగుపడనున్నాయి. ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.
133 కి.మీ. రోడ్లు.. రూ.16.54 కోట్లు:జిల్లా వ్యాప్తంగా 133 కి.మీ పొడువున రోడ్లు పాడైనట్లు గుర్తించారు. వాటి మరమ్మతుకు రూ.16.54 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదలను సిద్ధం చేశారు. ఇందులో డోర్నకల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 41.15 కి.మీటర్ల పొడువున పాడైన రోడ్లను బాగు చేయడానికి రూ.6.92 కోట్లు, మహబూబాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 37.40 కి.మీ రోడ్డు మరమ్మతుకు రూ.3 కోట్లు, ములుగు నియోజకవర్గంలోని రెండు మండలాల్లో 54.45 కి.మీటర్ల పొడువు కోతకు, దెబ్బతిన్న రహదారులను బాగు చేయడానికి రూ.6.61 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు రూపొందించారు.