ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెరపి లేకుండా కురుస్తున్న ముసురు, అక్కడక్కడా పడుతున్న వానలు ధాన్యం పండించిన వరి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో కురిసిన వానలకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి మొలకెత్తింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో రైతుల ధాన్యం మొలకెత్తి ఎందుకూ పనికి రాకుండా పోతోంది. ధాన్యం తీసుకువచ్చి వారం పది రోజులైనా తేమ శాతం పేరిట ప్రభుత్వ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ధాన్యాన్ని కొనడం లేదు. నాణ్యత పేరిట పదేపదే తూర్పార పట్టమంటున్నారని.. తేమ శాతం వచ్చినా కొనుగోళ్లు చేపట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
ఎందుకు పనిరాకుండా పోతోంది..
నెల రోజుల కిందట కేంద్రానికి చేరిన ధాన్యాన్నే ఇప్పటికీ కొనుగోలు చేయలేదని, ధాన్యం ఇంకా వస్తే ఎప్పడు కొనుగోలు చేస్తారని మండిపడుతున్నారు. వానలు పడ్డప్పుడల్లా నేలమీద ధాన్యం తడిసి మొలకెత్తుతోందని వాపోతున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం జాప్యం కారణంగా కొంత మొలకెత్తగా.. మరికొంత రంగు మారిందని.. వానలు ఇలాగే కొనసాగితే పండించిన పంట ఎందుకు పనికి రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల మాత్రమే కాదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని కొనుగోలు కేంద్రాలలోనూ ఇదే దుస్థితి. ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగడం లేదు. వాతావరణం అనుకూలించక రైతులు ఆపదలో ఉన్న వేళ ప్రభుత్వమే చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం రంగుమారినా, మొలకెత్తినా, నాణ్యత లేకపోయినా తక్షణం కొనుగోళ్లు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.