పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండపూర్లో జలాశయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016లో ప్రకటించిన ఈ ప్రాజెక్టుతో ఖానాపూర్, వల్లూరు, ఉదండపూర్, పోలెపల్లి, కిష్టారం గ్రామాలకు చెందిన 4 వేల 200 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. వీటిలో ఉదండపూర్, వల్లూరు గ్రామాలు పూర్తిగా ముంపులో ఉన్నందున ఇక్కడి ప్రజలు ఇళ్లు, పొలాలు రెండింటినీ కోల్పోవాల్సి వచ్చింది.
వీరందరికి ఎకరానికి సాధారణ వ్యవసాయ భూములకు ఐదున్నర, మాగాణికి ఆరున్నర లక్షల పరిహారం చెల్లించేందుకు నిర్ణయించారు. అలాగే, పక్కనే ఉన్న పోలెపల్లిలో ఎకరానికి 11 లక్షలు చెల్లించారు. ఇళ్లు కోల్పోయిన ఉదండపూర్, వల్లూరువాసులకు ఇంటి స్థలంతోపాటు ఒక్కో కుటుంబానికి 12 లక్షల పరిహారం అందిస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చారు.