పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఆ ప్రాజెక్టు కాలువల పరివవాహక ప్రాంత గ్రామాల ప్రజలతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అభిప్రాయ సేకరణ జరుపుతోంది. మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల పరిధిలో 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ప్రాజెక్టుపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయా జిల్లాల పరిధిలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ వద్ద 80 గ్రామాల ప్రజలు, రైతులతో అధికార యంత్రాంగం సమావేశాన్ని నిర్వహిస్తోంది. రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్, సాగునీటి ఎస్ఈ ఏఎస్ఎన్ రెడ్డి, పర్యావరణ శాఖ ఈఈ వెంకన్న, విశ్రాంత ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికార యంత్రాంగం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ జరిగే ప్రాంతాల్లో భారీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమావేశ ప్రాంగణాల్లోకి గ్రామస్థుల సెల్‌ఫోన్లను పోలీసులు అనుమతించలేదు.
మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలి..
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బడ్జెట్లో సరిపడ నిధులు కేటాయించి రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని తలకొండపల్లి మండల రైతులు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కాలువల కింద భూమి నష్టపోయే రైతులకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ అనుమతులు, సూచనలపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్న నేపథ్యంలో 80 గ్రామాల ప్రజలు అధికారుల సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను తెలిపారు. తాగు, సాగు నీరును అందించి తమ భూములను సస్యశ్యామలం చేసే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని పలువురు రైతులు స్పష్టం చేశారు. అయితే సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు.
న్యాయస్థానాల్లో కేసులు..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న జలాశయాల నుంచి కాల్వలు తవ్వి ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల ప్రారంభంలో పర్యావరణానికి హాని కలుగుతుందని కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేశారు. అందువల్ల పనుల్లో జాప్యం జరుగుతుందని వివిధ సందర్భాల్లో ప్రభుత్వం వెల్లడించింది. ఆ పరిస్థితులు తలెత్తకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు.