తెలంగాణ

telangana

ETV Bharat / state

'అన్ని రకాల పత్తిని కొనుగోలు చేయాలి'

అధిక వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. దిగుబడులను అమాంతం మింగేశాయి. ఎకరాకు క్వింటా నుంచి 5 క్వింటాళ్లలోపు పత్తిచేతికొస్తే ఆ సరుకును అమ్ముకుందామనుకుంటే ఒక్కచోట మినహా ఎక్కడా సీసీఐ కేంద్రాలు తెరచుకోలేదు. వర్షాలకు పత్తి దెబ్బతినడం వల్ల ప్రమాణాలు లేవని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరిస్తున్నారు. వేరే దిక్కు లేక రైతన్న ప్రైవేటు వ్యాపారు దగ్గరికే వెళ్లాల్సిన దుస్థితి తలెత్తింది.

పాలమూరు పత్తి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చిన వర్షాలు
పాలమూరు పత్తి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చిన వర్షాలు

By

Published : Nov 5, 2020, 5:25 AM IST

Updated : Nov 5, 2020, 7:43 AM IST

పాలమూరు పత్తి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చిన వర్షాలు

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో పత్తి రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు 5 జిల్లాల్లోనూ గతేడాది కంటే అధికంగా పత్తి సాగుచేసిన రైతులు అధిక వర్షాలకు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకూ రావాల్సిన దిగుబడి... క్వింటా నుంచి ఐదు క్వింటాళ్లకు పడిపోయింది. వానలకు పత్తిరంగు మారిపోయి నాణ్యత దెబ్బతింది. ఈ తరుణంలో సీసీఐ లేదా రాష్ట్రప్రభుత్వం రంగు మారిన పత్తిని సైతం మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకుంటాయని భావించిన కర్షకులకు కొనుగోలు కేంద్రాల వద్ద నిరాశే ఎదురవుతోంది.

అన్నదాతల ఆవేదన...

8 నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తికి మాత్రమే సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారు. రంగు మారినా... పింజ నిర్ణీత పొడవు లేకపోయినా తేమశాతం కాస్త అటూ ఇటూగా ఉన్నా... సీసీఐ పత్తి కొనుగోలు చేయడం లేదు. ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళితే రూ. 3వేల నుంచి 4వేల వరకూ మాత్రమే ధర చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఎవరు ఆదుకుంటారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

10 లక్షల ఎకరాల్లో పత్తి...

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గతేడాది 14 చోట్ల సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈసారి సుమారు 17 చోట్ల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలున్నాయి. కాని ఇప్పటి వరకూ ఒక్క నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం తిప్పరాసుపల్లి వద్ద తప్ప ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు.

కేంద్రాలను తెరవండి...

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడకుండా ఈసారి టోకెన్ విధానాన్ని ఏర్పాటు చేశారు. కేటాయించిన రోజే వెళ్లి పత్తి అమ్ముకోవాలి. కానీ రోజుకు మండలానికి పది చొప్పున 60 నుంచి 70 టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నారు. రోజుకూ 100 మంది రైతులు కూడా పత్తి అమ్ముకోలేకపోతే... వేలాది మంది రైతుల లక్షల ఎకరాల్లోని పంట అమ్మేదెప్పుడన్నది రైతుల ప్రశ్న. అందుకే వీలైనన్ని ఎక్కువ కేంద్రాలను వెంటనే తెరవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కొనుగోలు చేయాలని డిమాండ్...

వ్యవసాయశాఖ రికార్డుల్లో ఏ రైతు, ఎంత విస్తీర్ణంలో పండించాడని ఉంటే ఆమేరకు మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు. పంటల వివరాల నమోదులో లోపాలుంటే ఇబ్బందులు తప్పడం లేదు. టోకెన్లు లేకుండా సీసీఐ కేంద్రానికి వచ్చిన రైతుల పత్తిని ప్రైవేటులోనైనా కొనుగోలు చేసేవాళ్లు. ఈసారి సీసీఐ కేంద్రాల వద్ద ప్రైవేటు కొనుగోళ్లను నిలిపివేయగా... సీసీఐ తిరస్కరించిన రైతులు, టోకెన్లు లేకుండా కేంద్రానికి వచ్చిన రైతులు వాహనాలతో పడిగాపులు పడాల్సి వస్తోంది. అలా కాకుండా నాణ్యత విషయంలో కాస్త రాజీపడి అన్నిరకాల పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మద్దతు ధర...

ఇప్పటికైనా సీసీఐ అధికారులు స్పందించి వీలైనంత తొందరగా కొనుగోలు కేంద్రాలను తెరవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో నాణ్యత లోపించిన పత్తిని సైతం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:విజయశాంతితో భేటీ అయిన మాణికం ఠాగూర్​

Last Updated : Nov 5, 2020, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details