గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హన్వాడ మండలంలోని చెరువులు, కుంటలు నిండిపోయాయి. అదనులో మంచి వర్షం కురవడం, చెరువులు, కుంటలు నిండటం వల్ల రైతన్నల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో 17 సెంటీమీటర్లు, అర్బన్ మండలంలో 13 సెంటీమీటర్లు, భూత్పూరులో 12 సెంటీమీటర్లు, మూసాపేట మండలంలో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని కోయల్ కొండ, బాలనగర్ మండలాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి.
మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం సగటు వర్షపాతం..7.4 సెంటీ మీటర్లు నమోదు కాగా.. జూలై ఒకటి నుంచి 3వరకు వరకూ సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. మూడు రోజుల్లో 91 మిల్లీ మీటర్లు సాధారణం కాగా... 214.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం 15 మండలాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదు కావడం గమనించాల్సిన అంశం.