ROB Work Completed in Devarakadra: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ ప్రజల చిరకాలవాంఛ అయిన రైల్వేఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి కావొస్తుండటంతో ఆమార్గంలో ప్రయాణించే ప్రజలు, వాహనదారుల నిరీక్షణకు తెరపడనుంది. రూ.24.63 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆర్వోబీ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. రహదారిపై ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద గేట్ పడితే వాహనదారులు గంటలకొద్ది నిరీక్షించాల్సిన పరిస్థితి. అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకుని రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి.
నాలుగేళ్ల నిరీక్షణకు తెర: ఎట్టకేలకు వంతెన పనులు పూర్తయి నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడనుండటంతో ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవరకద్ర రైల్వే క్రాసింగ్ పైవంతెన 2014లోనే మంజూరైంది. గుత్తేదారు నిర్మాణ పనులు ప్రారంభించక పోవటంతో ఆ టెండర్ రద్దుచేశారు. తర్వాత 2018లో మరోసారి మంజూరు వంతెన నిర్మాణానికి టెండర్ ఖరారైంది. 2019లో నిర్మాణం మొదలైంది. డిజైన్‌లో లోపాలు, మట్టి సమస్య ఉండటం, రోడ్డు ఆక్రమణకు గురికావడం.. కరోనా సమయంలో నిర్మాణ పనుల్లో జాప్యం చోటుచేసుకుంది.
వాహనాల రాకపోకలు ప్రారంభించాలి:నిర్ణీత సమయానికి పైవంతెన పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. అవి పూర్తికాగానే వంతెనపై వాహనాల రాకపోకల్ని అధికారికంగా అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగేళ్ల పాటు కొనసాగిన ఈ నిర్మాణ పనుల వల్ల దుమ్ము-ధూళి పెరిగిపోయి ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తైనందున ఇప్పటికైనా అధికారులు వంతెనపై నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
"ఈ వంతెన నిర్మించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలుగుతాయి. మహబూబ్‌నగర్ నుంచి రాయచూర్.. రాయచూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల వల్ల ట్రాఫిక్ ఉండేది. అంతేకాక గతంలో రోజుకు పది నుంచి పదిహేను సార్లు రైల్వే గేటు పడేది. తద్వారా మూడు నాలుగు కిలోమీటర్లు ట్రాఫిక్ స్తంభించేంది. ఇప్పడు ఆ కష్టాలు తీరుతాయి. ఇప్పటికైనా అధికారులు వంతెనపై నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభించాలని కోరుతున్నాం." - స్థానికులు