Rahul Gandhi Fires on KCR and Modi: రాజకీయ నాయకులు ప్రజల మాట వినాలని.. భాజపా, ఆర్ఎస్ఎస్, తెరాస పార్టీలు కలిసి ప్రజల గొంతు నొక్కేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా సోలిపురం జంక్షన్లో జరిగిన కూడలి సమావేశంలో మాట్లాడిన ఆయన.. మోదీ, కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రజలను భయపెట్టి, గొడవలు పెంచి, హింసను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేపట్టామని వివరించారు.
ఏం జరిగినా యాత్ర ఆగదని, కశ్మీర్ చేరుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశ ప్రజల గొంతుకైన ఈ యాత్రను ఆపే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రైవేటుపరం చేస్తున్నారని యువకులు ఆరోపిస్తున్నారన్నారు. ఉన్నత విద్యావంతులు ఉద్యోగాలు లేక కూలీలుగా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత చదువులు చదివినా.. దానికి తగిన ఉద్యోగం లేక యువత బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం బోధన రుసుములు చెల్లించకపోవడంతో డబ్బు చెల్లించి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ చిరు, మధ్యతరహా వ్యాపార రంగం, చేనేత రంగాన్ని కుదేలు చేసిందన్న ఆయన.. అధికారంలోకి వచ్చాక చేనేత రంగంలో చెల్లించిన జీఎస్టీకి పరిహారం చెల్లిస్తామన్నారు. చిరు, మధ్యతరహా వ్యాపారులే దేశంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా ఉపాధి లేక నిరుద్యోగం పెరిగిందని విశ్లేషించారు.