Pulses cultivation has decreased in joint Mahabubnagar: వ్యవసాయశాఖ యాసంగిలో వరికి బదులు పప్పుదినుసుల్ని పండించాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నా.. పప్పుదినుసుల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతూ వస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పప్పుశనగ విస్తీర్ణం సాగు ఏటా తగ్గుతోంది. జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలోనే పప్పుశనగ పండుతుంది. యాసంగిలో పప్పుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 30వేల ఎకరాలు కాగా.. ఈసారి 14వేల ఎకరాల్లోనే సాగైంది. గద్వాల జిల్లాలో 13వేలు, వనపర్తి జిల్లాలో 995 ఎకరాల్లో రైతులు పప్పుశనగ వేశారు. ఏటా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, దిగుబడి తగ్గడం, బహిరంగ మార్కెట్ లో గిట్టుబాటు ధర లేకపోవడం, మార్కెటింగ్ లేకపోవడం లాంటి కారణాల వల్ల పప్పుశనగ విస్తీర్ణం ఏటా గణనీయంగా పడిపోతోంది.
చలి వాతావరణంలోనే పప్పుశనగ బాగా పండుతుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని సారవంతమైన నల్ల రేగడి నేలలు అందుకు అనుకూలం. అందుకే యాసంగిలో అలంపూర్, ఉండవెల్లి, గట్టు, ధరూర్, మల్దకల్ మండలాల్లో గతంలో పప్పుశనగను విస్తృతంగా సాగు చేసేవాళ్లు. కానీ కొనేళ్లుగా ఆ పంటకు వాతావరణం అనుకూలించడం లేదు. పంటేసిన తర్వాత నెల రోజుల్లో ఒకటి రెండు వర్షాలు కురిస్తే పంటకు అనుకూలం. కానీ సకాలంలో వానలు కురవక దిగుబడి పడిపోతోంది. పూత దశలో వర్షం పడితే పంటకు నష్టం.
ఒకప్పుడు ఎకరాకు 10 నుంచి 15క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చేది. ఇటీవల వ్యవసాయశాఖ అధికారులు వేసిన అంచనాలో పంట దిగుబడి ఎకరాకు 3 క్వింటాళ్లకు పడిపోయింది. ఒకప్పుడు రాయితీపై విత్తనాలు అందేవి. ఇప్పుడు రైతులు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఎరువులు, పురుగు మందులు సాగు ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఎకరానికి పెట్టుబడి ఖర్చు రూ.30,000 నుంచి రూ.50,000 వరకూ పెరిగినా.. గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. పదేళ్లుగా క్వింటాకు రూ.4000 నుంచి రూ.5000 వరకూ మాత్రమే ధర పలుకుతోంది. పెట్టుబడులు పెరిగి, దిగుబడి తగ్గి, గిట్టుబాటు ధర లేకపోవడంతో నడిగడ్డ రైతులు పప్పుశనగ వదిలి ఇతర పంటల వైపు మళ్లుతున్నారు.