కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల జలాశయం చెంత మరో రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదన రూపుదాల్చుతోంది. 20.5 టీఎంసీల సామర్థ్యంతో నెట్టెంపాడు పేరుతో ప్రతిపాదిస్తున్న రెండో జలాశయం నుంచే గట్టు ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించనున్నారు. నాలుగు టీఎంసీల నుంచి 15 టీఎంసీల సామర్థ్యానికి పెరిగిన గట్టు ఎత్తిపోతల పథకానికి 2018 జూన్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తాజాగా నెట్టెంపాడు జలాశయ నిర్మాణ ప్రతిపాదనలతో గట్టు సామర్థ్యాన్ని మళ్లీ నాలుగు టీఎంసీలకు కుదించాలని భావిస్తున్నారు. జూరాల నుంచి రెండు ఎత్తిపోతల ద్వారా రెండు జలాశయాలను నింపేలా రూపొందించిన నిర్మాణ రేఖాచిత్రాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. నెట్టెంపాడు, గట్టు జలాశయాల నిర్మాణానికి దాదాపు రూ.6500 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానదిపై ఉన్న జూరాల జలాశయ నిల్వ సామర్థ్యం తగ్గి... తాగు, సాగునీటి అవసరాలకు చాలని స్థితిలో ఈ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.
కొత్త జలాశయం నుంచే ‘గట్టు’కు
ర్యాలంపాడు జలాశయం నుంచి నాలుగు టీఎంసీల సామర్థ్యంతో గట్టు ఎత్తిపోతల పథకం నిర్మించాలని మొదట్లో భావించారు. వరదల సమయంలోనే నీటి ఎత్తిపోతకు వీలుంటుందన్న కారణంతో నేరుగా జూరాల జలాశయం నుంచే నీటిని తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ మేరకు గట్టు సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచి, రూ.4500 కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం 490 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్లాలంటే విద్యుత్తు వినియోగం అధికమవుతుందనే కారణంతో గట్టు సామర్థ్యాన్ని మళ్లీ 4 టీఎంసీలకు కుదించి 450 మీటర్ల వద్ద నిర్మించేలా డిజైన్ చేస్తున్నారు.
దీనికి జూరాల నుంచి కాకుండా కొత్తగా నిర్మించతలపెట్టిన నెట్టెంపాడు జలాశయం నుంచి నీటిని తీసుకోనున్నారు. ‘గట్టు’ ద్వారా 33 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం.