అసలే 55 రోజుల సిబ్బంది సమ్మె ప్రభావం నుంచి అప్పుడప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని కరోనా రూపంలో మరోసారి కష్టాలు కమ్మేశాయి. లాక్డౌన్ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. మే 19 తర్వాత మెల్లగా రోడ్డెక్కిన కరోనా భయంతో ప్రజలెవరూ రవాణాకు బస్సులను ఉపయోగించలేదు. దీనివల్ల ఆర్టీసీ ఆదాయానికి గండి పడింది.
ఆదాయ బాటలో మహబూబ్‌నగర్ ఆర్టీసీ 3 వారాలకే రూ.13 కోట్ల ఆదాయం
సాధారణ రోజుల్లో నెల ఆదాయం రూ.35 కోట్లుండే మహబూబ్‌నగర్ రీజియన్.. లాక్డౌన్ నిబంధనల సడలింపు తర్వాత రూ.4 కోట్లకే పరిమితమైంది. తర్వాత ఒక్కో నెల నెమ్మదిగా పెరుగుతూ వస్తున్న ఆదాయం సెప్టెంబర్ నెలలో మూడు వారాలకే రూ.13 కోట్లు దాటింది. ఆగస్టులో ఉమ్మడి జిల్లా (రీజియన్) 9 డిపోల నుంచి రూ.12 కోట్ల ఆదాయం రాగా.. సెప్టెంబర్‌లో మూడు వారాలకే రూ.13 కోట్లు దాటింది.
ఆదాయ బాటలో మహబూబ్‌నగర్ ఆర్టీసీ కార్గోతో పెద్దగా పెరగని ఆదాయం
కార్గో సేవల్లో ఆశించిన ఆదాయం సమకూరడం లేదు. రాష్ట్ర రాజధాని సమీపానే ఉండటం, డోర్ డెలివరీ సేవలు ప్రారంభం కాకపోవడం వల్ల రోజుకు సగటున రూ.75 వేలు రావాల్సి ఉన్నా.. రూ.50వేలు దాటడం లేదు. 9 డిపోల్లో కార్గో బస్సులున్నా.. బల్క్ బుకింగ్‌లు లేకపోవడం వల్ల పార్సిల్ కౌంటర్లతోనే సేవలందిస్తున్నాయి.
పల్లెలకు ఇంకా పెరగని సర్వీసులు
నష్టాల ఊబిలో చిక్కుకున్న మహబూబ్‌నగర్ ఆర్టీసీ ఆదాయ మార్గాన ప్రయాణించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాలోని అన్ని డిపోలు.. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన మార్గాల్లోనే ప్రస్తుతం ఎక్కువ ట్రిప్పులు నడిపిస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. కొన్ని మండల మర్గాల్లో మాత్రమే బస్సులు నడుస్తున్నాయి, చాలా పల్లెలకు ఆర్టీసీ బస్సులను ఇంకా పునరుద్ధరణ చేయకపోవడం వల్ల ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో రద్దీ పెరుగుతున్నా.. కరోనా వల్ల అందుకు తగినట్లు బస్సులు లేక ఆదాయంపై ప్రభావం పడుతోంది.