రుతుపవనాలు సమయానికే రావడం.. వర్షాలు కురుస్తుండడంతో... ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు సమాయాత్తమవుతున్నారు. ఓ వైపు నర్సరీలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ... మరోవైపు రహదారుల వెంట, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని పెట్టుకున్నారు. మొక్కలు నాటేందుకు అనువుగాని ప్రాంతాల్లో, కొండకోనల్లో, గుట్టల్లో విత్తన బంతులు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది కోటి విత్తన బంతులు వెదజల్లేందుకు లక్ష్యం పెట్టుకుని.. కోటి 18 లక్షల విత్తన బంతులు వేసి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఏడు ఆ రికార్డును తిరగరాసేందుకు సిద్ధమయ్యారు.
ఖర్చు లేకుండా
రెండు కోట్ల విత్తన బంతులను తయారు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా పచ్చదనం పెంపుకోసం కృషి చేస్తున్నారు. అందుకనుగుణంగా మహిళలు ఉచితంగా విత్తన బంతులు తయారు చేసేందుకు ముందుకు రాగా... అటవీ శాఖ విత్తనాలను సేకరించి సమకూరుస్తోంది. విత్తన బంతులు తయారీకి అవసరమైన ఎరువు, మట్టిని గ్రామ పంచాయతీలు సిద్ధం చేస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కృషి చేస్తోంది.
స్వచ్ఛందంగా
విత్తన బంతుల తయారీలో పాలమూరు జిల్లా మహిళా సంఘాలకు అనుభవం ఉంది. సర్వైవల్ శాతం అధికంగా ఉండే విధంగా విత్తన బంతుల తయారీపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకనుగుణంగా జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ ఆధ్వర్యంలో మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక శిక్షణలిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు విత్తన బంతులపై అవగాహన కల్పిస్తున్నారు. 10,506 మహిళా సంఘాల్లో ఉన్న 1,28,560 మంది మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని విత్తన బంతులను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు.