Government Vocational Junior College Mahbubnagar: మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల.. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏకైక వృత్తి విద్యా కళాశాల. ఇక్కడ ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, నిర్మాణరంగం, కంప్యూటర్ సైన్స్, గ్రాఫిక్స్-యానిమేషన్, ఎమ్ఎల్టీ, ఎమ్పీహెచ్డబ్ల్యూ ఇలా పదిరకాల కోర్సులున్నాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి సుమారు వెయ్యిమంది చదువుతున్నారు. ఒక్కో కోర్సుకు 2తరగతి గదుల చొప్పున 20గదులు, 7 ప్రయోగశాలలు అంటే సుమారు 27 గదులు అవసరం.
కానీ ప్రస్తుతం అక్కడ అందుబాటులో ఉంది కేవలం 7 షెడ్లు మాత్రమే. ఆ షెడ్లలోనే తరగతులు, ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. చేసేదిలేక విద్యార్ధులు పక్కనే అసంపూర్తిగా ఉన్న భవనంలో కింద కూర్చొని తరగతులు వింటున్నారు. అసంపూర్తిగా ఉన్న భవనంలో బోర్డులు, విద్యుత్ సౌకర్యం లేక.. చీకట్లో చదువు సాగుతోంది. 250 మంది బాలికలకు.. ఉన్న మూత్రశాలలు సరిపోవడం లేదు. చేసేదేం లేక తరగతుల వారీగా అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. బాలురకైతే అసలు మూత్రశాలలే లేవు.
పక్కనున్న జూనియర్ కళాశాల శౌచాలయాలను వినియోగిస్తున్నారు. వృత్తి విద్యాకోర్సుల బోధన విషయంలో మహబూబ్‌నగర్ కాలేజీకి మంచి పేరున్నా.. వసతులు లేకపోవడంతో.. అక్కడ చేరిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారింది. అసంపూర్తిగా ఉన్న భవనాన్నిపూర్తి చేయడమే సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం. దాదాపు 70 శాతం పూర్తికాగా.. గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో.. పనులు నిలిచిపోయాయి. మూడేళ్లుగా భవన నిర్మాణపనులు ఆగిపోయినా.. పట్టించుకునే నాథుడే లేడు.
భవనం అందుబాటులోకి వస్తే సమస్యలు తీరుతాయి. నిర్మాణం పూర్తైతే అవసరమైనసామాగ్రిని పంపేందుకు ఉన్నత విద్యాశాఖ సిద్ధంగా ఉంది. కానీ భవనం ఎప్పుడు పూర్తవుతుందో తెలియక.. విద్యార్ధులు, అధ్యాపకులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం వృత్తి విద్యాకోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఆ కోర్సుల్లో చేరుతున్న విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏకైక వృత్తి విద్యాకళాశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.