Congress Party Situation in Palamuru District: పాలమూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కాస్త పట్టున్న జిల్లా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 శాసనసభ నియోజక వర్గాలుంటే... 2009 ఎన్నికల్లో 3స్థానాలు, 2014 ఎన్నికల్లో 5స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. వైఎస్ హయాంలో పాలమూరు నేతలు... జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ మంత్రులుగా పనిచేశారు. మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన జైపాల్‌రెడ్డి యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా చక్రం తిప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ పాలమూరు నేతల హవా కొనసాగింది. అలాంటి కాంగ్రెస్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాభవం కోల్పోతూ వస్తోంది.
ప్రస్తుతం పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ తరపున ఒక్క శాసనసభ్యుడు లేరు. 2018లో కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున అక్కడ పోటీ చేసి గెలిచిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్నికల తర్వాత తెరాసలో చేరారు. జిల్లాలో కీలకనేతగా ఉన్న డీకే అరుణ ఎన్నికల తర్వాత భాజపాలో చేరారు. అలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పట్టు కోల్పోతూ వస్తోంది. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్‌లో కొంత ఊపు కనిపించింది. ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభంకావడం శ్రేణుల్లో కొత్త ఉత్సహాన్ని నింపింది. జోడోయాత్రకు జనం స్పందన కనిపించడం పార్టీకి సానుకూలంగా మారింది. కానీ మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలుకావడం శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో హస్తం పార్టీకి పునర్వైభవం వస్తుందా అన్న అంశం చర్చ సాగుతోంది.
ఎవరికి టికెట్ దక్కుతుందో..ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున ఎవరికి టికెట్టు దక్కుతుందో స్పష్టత కరవైంది. గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా... ఎవరిదారిలో వాళ్లు నియోజకవర్గంలో సొంత ఇమేజ్‌ను పెంచుకునేందుకు కార్యక్రమాలు మొదలుపెట్టారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఢీకొనే అభ్యర్ధి పార్టీలో కరవయ్యారు. జడ్చర్లలో అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ మధ్య వర్గపోరు సాగుతోంది. పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవికి సైతం జడ్చర్లపై మంచిపట్టుంది. వీరిలో ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియక శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.