తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: పెరుగుతోన్న ధరలు.. మారుతోన్న అలవాట్లు - నిత్యావసర సరుకులపై కరోనా ఎఫెక్ట్​ వార్తలు

కరోనా మహమ్మారి తెలియకుండానే మానవ జీవన శైలిని మార్చేస్తోంది. పాత అలవాట్లు పోయి.. కొత్త పద్ధతులు అలవడుతున్నాయి. వైరస్​ భయంతో బయట తిండి దాదాపుగా మానేసిన జనం.. ఇంట్లోనే వండుకుని తింటున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం నిత్యావసర వస్తువుల వినియోగం గణనీయంగా పెరిగింది. నెలవారీ సరకుల్లో ఎండు ఫలాలు, శొంఠి, మిరియాలు, తేనె, శానిటైజర్లు, హ్యాండ్​వాష్​ల వినియోగం పెరిగింది. వీటికి తోడు ధరలూ పెరగడం వల్ల నెలవారీ ఖర్చు తడిసి మోపెడవుతోంది.

Prices of essential commodities increased by the corona effect
కరోనా ఎఫెక్ట్​: పెరుగుతోన్న ధరలు.. మారుతోన్న అలవాట్లు

By

Published : Aug 7, 2020, 8:37 AM IST

కరోనా మనిషి జీవితంలో తెలియకుండానే ఎన్నో మార్పులు తెస్తోంది. ఇన్నేళ్లుగా ఉన్న అలవాట్లు, పద్ధతులు కూడా అప్రయత్నంగానే మారిపోతున్నాయి. నెలవారీగా ఇంటికి తీసుకువచ్చే నిత్యవసర వస్తువుల జాబితాలు సైతం క్రమంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు సరుకుల జాబితాలో సాధారణంగా కనిపించే వస్తువులు.. ఇప్పుడు ప్రాధాన్య వస్తువులుగా మారిపోయాయి. ఇంటి పట్టునే ఉంటుండటం వల్ల విభిన్న రకాలైన వంటకాలు వండుకుని తింటున్నారు. ఫలితంగా సరకుల వినియోగం పెరిగింది. ఒకప్పుడు 3 వేల రూపాయల సరుకులు తీసుకువెళ్లే వాళ్లు.. ఈసారి ఆహారం, ఆరోగ్యం కోసం మరో 1500 అదనంగా ఖర్చు చేస్తున్నారు.

గిరాకీ తగ్గలేదు..

కరోనా ఏ రంగంపై ప్రతికూల ప్రభావం చూపినా.. కిరాణా దుకాణాల గిరాకీ మాత్రం తగ్గలేదంటున్నారు నిర్వాహకులు. గతంలో రాత్రి 10 గంటల వరకూ ఉంటేనే అయ్యే గిరాకీ.. ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు దుకాణం మూసేసినా.. అవుతోందని చెబుతున్నారు. ఆదాయం ఉన్నా లేకపోయినా.. ఆరోగ్యం ముఖ్యమనుకుని ప్రస్తుతం జనం తినేతిండికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పప్పులు, గుడ్లు, తేనె లాంటి వస్తువుల్ని విరివిగా వినియోగిస్తున్నారు.

ధరలకు రెక్కలు..

వినియోగం పెరగడం వల్ల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం నాణ్యమైన బియ్యం ధర కిలో 46 రూపాయలుంటే.. ఈ ఏడాది ఆగస్టులో 48 రూపాయలుంది. బహిరంగ మార్కెట్​లో 50 నుంచి 52 రూపాయలుగా అమ్ముతున్నారు. కందిపప్పు 89 రూపాయలుంటే.. ఇప్పుడు 95 రూపాయలైంది. మినపపప్పు ధర గతేడాది కిలో 79 రూపాయలుంటే.. ఈ ఏడాది 113 రూపాయలు. గతేడాది ఇదే సమయానికి 80 రూపాయలు కిలో అమ్మిన పెసరపప్పు ఇప్పుడు కిలో 115 రూపాయలుంది. పల్లినూనె 112 నుంచి 143 రూపాయలకు, పామాయిల్ నూనె 70 రూపాయల నుంచి 93 రూపాయలకు పెరిగింది.

కాస్త ఊరట..

కూరగాయల ధరలు మాత్రం ఆలుగడ్డ మినహా మిగిలిన అన్నింటికీ గతేడాదితో పోల్చుకుంటే ధరలు తగ్గడం ఊరటనిచ్చే అంశం. కానీ జులై నెలతో పోల్చుకుంటే 20 రూపాయలున్న కిలో వంకాయ ధర 40 రూపాయలు, 30 రూపాయలున్న బెండకాయ 35 రూపాయలైంది. ఇలా ఆహారపు అలవాట్లు మారి నెలవారీ సరుకుల వినియోగం, ఖర్చు క్రమంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు సైతం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై భారాన్ని మరింత పెంచుతున్నాయి.

ఇదీచూడండి: కేంద్ర మంత్రికి కేటీఆర్​ లేఖ.. బయోటెక్​ రంగం బలోపేతానికి సూచనలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details