మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పురపాలిక ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీని 27వార్డులుగా విభజించారు. 41,515 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 20,765 మంది పురుషులు, 20,749 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 108 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. 324 మంది సిబ్బందిని పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు.
బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. 27 వార్డుల్లో మొత్తం 112 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. తెరాస 27, కాంగ్రెస్ 25, భాజపా 22 వార్డుల్లో తమ అభ్యర్ధులను బరిలో నిలపగా సీపీఐ- 3, సీపీఎం-1,ఎంఐఎం-7 వార్డుల్లో పోటీ చేస్తోంది. అన్నివార్డుల్లో కలిపి 27మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యం శుక్రవారం బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తం కానుంది. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఇప్పటికే ఓటరు స్లిప్పులను పంపణీ చేశారు. కొవిడ్ నిబంధనలకు లోబడి అన్ని ఏర్పాట్లు చేశామని, పోలింగ్ సైతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు. జడ్చర్లలో ఆరు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని చెప్పిన ఎస్పీ వెంకటేశ్వర్లు పోలింగ్ కోసం పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ…
అచ్చంపేట పురపాలిక ఎన్నికల కోసం సైతం సర్వం సిద్ధమైంది. పట్టణంలో మొత్తం 20 వార్డులున్నాయి. 20,529 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 10,100 మంది పురుషులు 10,428 మంది మహిళలు ఉన్నారు. వీళ్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 80 బ్యాలెట్ బ్యాక్సులను సిద్ధం చేశారు. 250 పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు.
జేఎంజే హైస్కూల్ లో సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. అచ్చంపేటలో 20 వార్డులకు గాను అన్నివార్డుల్లోనూ తెరాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్దులు బరిలో నిలవగా మొత్తం ఆరుగురు స్వతంత్ర అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముగ్గురు డీఎస్పీ స్థాయి అధికారులు, ఐదుగురు సీఐలు, 22 మంది ఎస్ఐలు, 450 మంది కానిస్టేబుల్ లు మొత్తం 480 మంది సిబ్బంది తో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పటిష్ఠమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శర్మన్ పరిశీలించారు.
సర్వం సిద్ధం…
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలోనూ పోలింగ్ కు సర్వం సన్నద్ధమైంది. పట్టణాన్ని మొత్తం 12 వార్డులుగా విభజించగా.. 8,136 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 4,128 మహిళలు 4,006 మంది ఉన్నారు. కుమ్మరిగూడ ప్రాథమిక పాఠశాల, స్టేషన్ తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాల, తిమ్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల, కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. 12 వార్డులకుగాను తెరాస, కాంగ్రెస్, భాజపా అన్నివార్డుల్లో అభ్యర్థులను నిలిపాయి. మొత్తం 11 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 47 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
ఎన్నికల్లో 85 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. డీసీపీ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడుగురు సీఐలు, 17 మంది ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లు, 40 మంది సాయుధ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొవిడ్ నిబంధనల అమలు కోసం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను శానిటైజేషన్ చేశారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి రెండు మాస్క్ లు, హ్యాండ్ శానిజైటర్, ఫేస్ షీల్డ్, రెండు జతల హ్యాండ్ గ్లౌజులు, కూడా అందిస్తున్నారు.
ఓటర్ల కోసం ప్రతి కేంద్రంలో ఐదు శానిటైజర్ సీసాలు అందుబాటులో ఉంచనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేందుకు వలయాలు గీసి ఉంచారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో 5వ వార్డుకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నామపత్రం దాఖలు చేసిన ఏకైక అభ్యర్ది ఎరుకలి లక్ష్మీదేవమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.