ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి జనవరి నాటికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో... లక్షిత వర్గాలకు పక్కాగా చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తొలిదశ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ వైద్య సిబ్బందికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు.
తొలి దశలో ఎవరెవరికంటే..
మహబూబ్‌నగర్ జిల్లాలో 9,118, నారాయణపేట-2,203, నాగర్‌కర్నూల్-4,493, జోగులాంబ గద్వాల-2,060, వనపర్తి జిల్లాలో 2వేల 357మంది సిబ్బంది.. తొలి దశలో కొవిడ్ వ్యాక్సిన్‌ను పొందనున్నారు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు తొలిదశ టీకా పొందేవారిలో ఉన్నారు. కార్యాలయాల్లో పనిచేసే వైద్యారోగ్య సిబ్బంది ఆ జాబితాలో లేరు.
ప్రైవేట్ రంగంలోనూ గుర్తింపు పొందిన ఆసుపత్రులు.. ల్యాబ్‌లలో పనిచేసే సిబ్బందిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణ తరహాలోనే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనుండగా.. అందుకోసం పూర్తి సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఆధార్ మినహా ఇతర అధీకృత గుర్తింపు కార్డులున్న వారి సమాచారాన్నే అందులో నిక్షిప్తం చేశారు. ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఆధార్ మినహా.. ప్రభుత్వం సూచించిన ఏదైనా గుర్తింపు కార్డు ఉన్న వారికే టీకా అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.