ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. ఇల్లా ఒక్కో ప్రాజెక్టుకు ఒక్కో ముఖ్యఅధికారి ఉండేవారు. నీటిపారుదల శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న సీఎం ఆదేశాలతో భారీ, మధ్య తరహా, చిన్న నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ అన్ని కలవనున్నాయి. ఈ మేరకు ఇంజినీరింగ్ అధికారులు ముసాయిదాను సిద్ధం చేసి సీఎంకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీని ప్రకారం ప్రతి చీఫ్ ఇంజినీర్‌కు భౌగోళిక పరిధులు నిర్ణయించారు. వాటిలో ఉండే పథకాలన్నీ ఆ సీఈ పరిధిలోకి రానున్నాయి.
ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ కేంద్రాలుగా.. చీఫ్ ఇంజనీర్లకు భౌగోళిక పరిధులు నిర్ణయించారు. మొత్తం ఈ ముగ్గురి పరిధిలో ఉమ్మడి జిల్లాలోని నియోజక వర్గాలతో పాటు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలూ చేరాయి. జూరాల, నెట్టెంపాడు, గట్టు, భీమా, కోయల్ సాగర్, రాజోలి బండ, తుమ్మిళ్ల, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు సహా...15 నియోజకవర్గాల్లోని, 46 ఐడీసీ ఎత్తిపోతల పథకాలు, 7463 చెరువులు ఈ ముగ్గురు సీఈల పరిధిలోకి రానున్నాయి.27 లక్షల 34వేల ఎకరాల ఆయకట్టు ముగ్గురు సీఈల పరిధిలో ఉండనుంది. తెలంగాణలో సాగుయోగ్యమైన ప్రతి భూమికి సాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల శాఖ పునర్వవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ ముసాయిదాకు యథాతధంగా ఆమోదం తెలుపుతారా? మార్పులు చేర్పులు సూచిస్తారా వేచి చూడాల్సిందే.
వనపర్తి సీఈ భౌగోళిక పరిధులు
అలంపూర్, గద్వాల్, మక్తల్, వనపర్తి
వనపర్తి చీఫ్ ఇంజనీర్ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు ఇతరాలు
- 10 పంప్‌హౌజ్‌లు, 18 జలాశయాలు, 31 ఎత్తిపోతలు, 1654 చెరువులు
- ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు- 1.05 లక్షల ఎకరాలు
- జవహర్ నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల 2.33 లక్షల ఎకరాలు
- రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం 2.03 లక్షల ఎకరాలు
- కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకం 0.50 లక్షల ఎకరాలు
- రాజోలి బండ, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం 0.84 లక్షల ఎకరాలు
- ఐడీసీ ఎత్తిపోతల పథకాలు 0.53 లక్షల ఎకరాలు
- చెరువులు 0.80 లక్షల ఎకరాలు
- మొత్తం ఆయకట్టు 8.08 లక్షల ఎకరాలు