సెప్టెంబర్1 నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు యంత్రాంగం సిద్ధమైంది. కొవిడ్ నిబంధనల మేరకు బడులను సిద్ధం చేస్తున్నా... సమస్యలు ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్నారు. కనీసవసతులు లేకుండా కొవిడ్ నిబంధనలకు లోబడి పాఠాలు చెప్పడం ఎలా అని గురువులు మల్లగుల్లాలు పడుతున్నారు. మూడోదశ తప్పదంటున్న నిపుణుల అంచనాలతో బోధన... కత్తిమీద సాములా మారిందని టీచర్లు అభిప్రాయపడుతున్నారు.
40 మందికి రెండే గదులు..
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల హరిజనవాడ పాఠశాలలో రెండు గదులు శిథిలావస్థకు చేరాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి వసతి లేదు. 40మంది విద్యార్థులకు రెండు గదుల్లోనే సర్దాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
సగం వరకు శిథిలావస్థలోనే..
జడ్చర్ల పాతబజార్ ప్రాథమిక పాఠశాల పరిస్థితి మరీ దారుణం. నాలుగు గదులుంటే రెండింటిలో అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్నారు. చినుకు పడితే చిత్తడిగా మారే రెండు గదుల్లోనే 30మందిని కూర్చోబెట్టాల్సి వస్తోందని టీచర్లు వివరిస్తున్నారు. బయట కూర్చోబెట్టి చదువుచెబుతామన్న ఖాళీ స్థలం లేదు. తెలుగు, ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాలున్న బాదేపల్లి ఉన్నత పాఠశాలలో వెయ్యి మందికిపైగా విద్యార్థులుంటారు. 30 గదులుండగా 14 శిథిలావస్థలో ఉన్నాయి. షిఫ్టు విధానంలో తరగతులు చెప్పినా నిర్వహణ కష్టమేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఒక్కో గదిలో రెండు తరగతులు
మహబూబ్‌నగర్ అప్పనపల్లి ప్రాథమిక పాఠశాలలోనూ ఆరు గదులుంటే... మూడు శిథిలావస్థకు చేరాయి. కుమ్మరివాడ ఉన్నత పాఠశాలలో ఐదు గదులకు కేవలం మూడే అందుబాటులో ఉన్నాయి. పాఠశాల ఆవరణలో ఖాళీ స్థలం లేకపోవడం వల్ల ఒక్కో గదిలో రెండు తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి. నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి బాలుర హైస్కూల్, కొల్లాపూర్ గాంధీ హైస్కూల్, వరిజాల యూపీఎస్, నార్లాపూర్ ప్రాథమిక పాఠశాలల్లోనూ అదే పరిస్థితి. నాగర్ కర్నూల్ జిల్లాలో 230 పాఠశాలలు శిథిలావస్థలో ఉండగా 400 బడులకు ప్రహరీలు, 416 చోట్ల మూత్రశాలలు లేవు. సమస్యల మధ్య చదువులు చెప్పడం సవాల్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పశువుల కొట్టంలా..
గద్వాల గంజిపేట హరిజనవాడ పాఠశాలలో ఐదు గదులుండగా 3 శిథిలావస్థకు చేరాయి. గదుల కొరతతో ప్రస్తుతం 4,5 తరగతులు మాత్రమే నడిపిస్తున్నారు. అలంపూర్ బాలుర ఉన్నత పాఠశాలలో మూడు గదుల్లో వర్షం నీరు చేరుతోంది. అలంపూర్ మండలం క్యాతూరు , కాశీపూర్, సింగవరం, గొందిమల్ల, బుక్కాపూర్ పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. ర్యాలంపాడు ప్రాథమిక పాఠశాల పశువుల కొట్టంగా మారింది. గ్రామపంచాయతీ సిబ్బంది శుభ్రం చేయాల్సిన ఉన్నా పట్టించుకున్నవారే లేరు. పాఠశాల ఎలా నడపాలని ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు.
బళ్లు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్న యంత్రాంగం దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యల్ని కొవిడ్ విరామంలో పరిష్కరిస్తే బాగుండేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి:GOVERNMENT SCHOOLS: గడువు తరుముకొస్తోంది... బడి అగమ్యగోచరంగా దర్శనమిస్తోంది!