Dial 100 Saves Lives: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో డయల్ 100 నేరనియంత్రణ, ప్రాణరక్షణలో కీలకంగా పనిచేస్తోంది. కుటుంబంలో కలతల కారణంగా ఆత్మహత్య చేసుకుంటామంటూ వెళ్లిపోయిన బాధితుల్ని వారి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు డయల్ 100 సిబ్బంది రక్షిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్‌లో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటానని వెళ్లగా.. ఆయన భార్య 100కు సమాచారం ఇచ్చారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయనని రక్షించారు. ఇలా ఎందరినో ఆపద నుంచి రక్షించి ప్రాణాలు కాపాడారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు నెలల్లో 31 వేల కాల్స్ డయల్ 100కు వచ్చాయి. వాటిలో 23శాతం భౌతిక దాడులు, 20శాతం మహిళలపై నేరాలు, 12శాతం న్యూసెన్స్, మూడు శాతం ప్రమాదాలు, 39 శాతం ఇతర ఘటనలకు సంబంధించినవి. తమపై లేదా ఇతరులపై భౌతిక దాడులు జరుగుతుంటే ఎక్కువమంది 100కు ఫోన్ చేస్తున్నారు. మహిళలపై నేరాలు జరుగుతున్నా బాధిత మహిళలు లేదా వారి కుటుంబసభ్యులు, చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. 90 శాతం నేరాల్ని ముందుగానే నియంత్రిస్తుండగా 1 నుంచి 2శాతం కేసులు నమోదవుతున్నాయి.
డయల్ 100 సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటుండగా కొందరు అనవసర ఘటనల్లో ఫోన్ చేసి దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి వాటిలో మద్యంమత్తులో చేసేవే అధికం. ఇంకొందరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే వరకూ పదేపదే ఒకే ఫిర్యాదును పలుమార్లు నమోదు చేస్తున్నారు. అలాంటి చేష్టలతో పోలీసుల విలువైన సమయం, సేవలు వృధా అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో డయల్ 100 సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నా విస్తృత స్థాయి వినియోగం లేదు. చాలామంది కళ్లెదురుగా నేరాలు జరుగుతున్నా పోలీసులు, కేసులతో మనకెందుకులే అన్న కోణంలో ఫోన్ చేసేందుకు జంకుతున్నారు. ఇలాంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.