ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 772 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 22 మంది మహిళలు శిక్ష అనుభవిస్తున్నారు. కారాగారంలో ఉన్న ఖైదీలు, శిక్ష పూర్తి చేసుకుని బయటకు వెళ్లిన వారికి ఉపాధి కల్పించడానికి జిల్లా పోలీసు శాఖ పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసింది. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, అచ్చంపేటలో ఏర్పాటు చేసిన ఈ పెట్రోల్ బంకుల్లో 27 మంది ఖైదీలు ఉపాధి పొందుతున్నారు. వారికి నెలకు పన్నెండు వేల రూపాయల చొప్పున అధికారులు వేతనం అందిస్తున్నారు.
ఖైదీలకు మార్గం చూపిన పోలీసులు.. పెట్రోల్ బంక్‌లో విధులు - work for telangana prisoners
క్షణికావేశంలో చేసిన తప్పుకు వారి జీవితాలు జైలుపాలయ్యాయి. తెలిసీ తెలియక చేసిన నేరాలతో కొందరు, ఇతర కారణాలతో మరికొందరు ఖైదీలయ్యారు. కారాగార జీవితం వారిలో మార్పు తీసుకువచ్చింది. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తపడేలా చేసింది. సత్ప్రవర్తనతో అధికారుల మన్ననలు పొంది పోలీసు శాఖ నిర్వహించే పెట్రోల్ బంక్‌లో ఉపాధి పొందుతున్నారు.
బయటకు వెళ్తే సమాజం తమను నేరస్థులుగా ముద్ర వేస్తుందన్న భయంతో పనికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వారికోసం బంక్‌లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. పనిచేయడం వల్ల ఖైదీల్లో మార్పు వస్తోందని, కష్టపడే తత్వం అలవాటవుతుందని అభిప్రాయపడ్డారు.
పోలీసులు చూపిన మార్గం
చేయని నేరాలకు శిక్ష అనుభవించిన తమ కేసులను కోర్టు కొట్టేసిందని మాజీ ఖైదీలు తెలిపారు. జైలుకు వెళ్లినందున బయట ఎవరూ పని ఇవ్వడం లేదని అధికారులను సంప్రదిస్తే తమకు ఉపాధి మార్గం చూపారని చెప్పారు. ప్రస్తుతం సబ్‌జైల్ పెట్రోల్ బంక్‌లో పని చేస్తూ తమ కుటుంబానికి అండగా ఉంటున్నామని వెల్లడించారు.
- ఇదీ చూడండి :కడప ఖైదీలు.. నెల రోజుల్లో లక్ష మాస్కులు